అంతర్జాతీయం

ఏడేళ్ల తర్వాత చైనాకు ప్రధాని మోడీ.. ఘన స్వాగతం పలికిన డ్రాగన్ కంట్రీ!

PM Modi China Visit:  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనాలో అడుగు పెట్టారు. దాదాపు ఏడేళ్ల తర్వాత బీజింగ్‌ కు చేరుకున్నారు. టియాంజిన్‌ ఎయిర్‌ పోర్ట్‌ లో ప్రధానికి రెడ్‌ కార్పెట్‌ వేసి అక్కడి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 1 వరకూ.. రెండు రోజుల పాటూ చైనాలో ప్రధాని పర్యటించనున్నారు. టియాంజిన్‌ లో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ పర్యటన సందర్భంగా తొలిరోజు చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ తో  మోడీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. భారత్‌ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అదనపు సుంకాల వేళ ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏడేళ్ల తర్వాత చైనాకు మోడీ

అటు ప్రధాని మోడీ ఏడేళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్నారు. చివరిసారిగా 2018లో పర్యటించారు. ఆ తర్వాత చైనా  అధ్యక్షుడు 2019లో భారత్‌లో పర్యటించారు. ఆ తర్వాత 2020లో లద్దాఖ్‌ సరిహద్దుల్లో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గత అక్టోబర్‌ లో జరిగిన బ్రిక్స్‌ సదస్సులో ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ జరిగింది. నేరుగా విమాన సర్వీసులు, కైలాస్‌ మానసరోవర్‌ యాత్రను పునరుద్ధరించేందుకు ఈ సంవత్సరం జూన్‌ లో ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ ఎస్‌సీఓ సమ్మిట్‌ కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సహా మధ్య, పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలకు చెందిన దాదాపు 20 మందికిపైగా ప్రపంచ నాయకులు పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button