జాతీయం

జైలు నుంచి పాలన కుదరదు.. తేల్చిన చెప్పిన ప్రధాని మోడీ!

PM Modi On Law to Disqualify: తీవ్ర నేరారోపణలతో అరెస్టయిన వ్యక్తులు జైలు నుంచి పాలన సాగించడం ఇకపై కుదరదని ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. 30 రోజులకు పైగా జైలులో ఉన్న పీఎం, సీఎం, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు 31వ రోజున ఆటోమేటిగ్గా పదవిని కోల్పోయేలా తీసుకొచ్చిన బిల్లులను ఆయన మరోసారి సమర్థించారు. 50 గంటల పాటు జైలు శిక్ష అనుభవించిన ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతే,  ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మంత్రులకు ఈ నిబంధన ఎందుకు వర్తించదని ప్రశ్నించారు.  రాజకీయ నాయకులు జైల్లో ఉన్నా ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. కొంతకాలం క్రితం కొందరు నేతలు జైళ్ల నుంచే ఫైళ్లపై సంతకాలు చేయడం, ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం చూశామన్నారు. నాయకులే ఇలా ఉంటే.. ఇక అవినీతిపై ఎలా పోరాడగలమని  ప్రధాని ప్రశ్నించారు.

ఆర్జేడీ పాలనలో అంధకారం, అశాంతి

బీహార్‌ లో పర్యటించిన ప్రధాని మోడీ రూ.13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మోడీ.. ఆర్జేడీ పాలనలో రాష్ట్రాన్ని అంధకారం, అశాంతి, వెనుకబాటుతనంలోకి నెట్టేశారని ఆరోపించారు. బిహార్‌ ప్రజలను ఓటు బ్యాంకుగానే పరిగణించి, వారి ఆకాంక్షలు, గౌరవం, అభివృద్ధిని విస్మరించారని ధ్వజమెత్తారు. ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మూడు బిల్లులను వ్యతిరేకిస్తున్న విపక్షాలపై మోదీ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌, ఆర్జేడీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఒక్క అవినీతి కేసును కూడా ఎదుర్కోలేదని, అయితే 60-65 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో వారి అవినీతికి సంబంధించిన పెద్ద చిట్టానే ఉందని ఎద్దేవా చేశారు. అందుకే ఈ బిల్లులను వారు వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.

మమత ప్రభుత్వంపై మోడీ తీవ్ర విమర్శలు

అటు బెంగాల్‌లోని మమత ప్రభుత్వంపైనా ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి టీఎంసీని శత్రువుగా మారిందన్నారు.  మహిళలు, పేదల సంక్షేమం కోసం కేంద్రం పంపిన నిధులను పార్టీ కేడర్‌ కోసం వినియోగిస్తున్నారని ఆరోపించారు. కోల్‌ కతాలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్‌ అభివృద్ధి చెందేవరకూ వికసిత్‌ భారత్‌ యాత్ర విజయవంతం కాదన్నారు. టీఎంసీ అధికారంలో ఉన్నంత వరకూ రాష్ట్రంలో అభివృద్ధి అనే మాట ఉండదన్నారు. అధికార దాహంతో ఉన్న టీఎంసీ, కాంగ్రెస్‌ పార్టీలు అక్రమ చొరుబాట్లను ప్రోత్సహిస్తున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ ప్రయోజనాలు దక్కాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. అంతకుముందు కోల్‌కతాలో మూడు కీలక మెట్రో రైల్వే స్టేషన్లు సహా రూ.5,200 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మోడీ ప్రారంభించారు.  హౌరా-కోల్‌కతా మధ్య కనెక్టివిటీని పెంచనున్న   7.2 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కోనా ఎక్స్‌ ప్రెస్ వేకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button