
ఉగ్రవాదానికి వ్యతిరేకం అని చెప్తూ, ఉగ్ర కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న పాకిస్తాన్ కు దానిని మద్దతు పలుకుతున్న చైనాకు ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు పనికిరావన్నారు. ఉగ్రవాదాన్ని, దాన్ని సమర్థించే వారిని భారత్, బ్రెజిల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. పాక్, చైనాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులాతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో భారత్ కు బ్రెజిల్ మద్దతుగా నిలవడం పట్ల ప్రెసిడెంట్ లులాకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు.
కీలక అంశాలపై భారత్, బ్రెజిల్ చర్చలు
అటు భారత్, బ్రెజిల్ దేశాధినేతలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఆరోగ్యం, ఔషధాలు, అంతరిక్షం, ఆహారం, మౌలిక వసతుల అభివృద్ధి లాంటి అంశాల్లో ఇరు దేశాలు సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ కీలక ప్రకటన చేశారు. అటు ప్రధాని మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్’ ప్రదానం చేశారు. మరోవైపు అటు బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం తర్వాత ప్రధాని మోడీ బ్రెజిలియా చేరుకున్నారు. అల్వరాదా ప్యాలెస్ దగ్గర 114 గుర్రాలతో పరేడ్ నిర్వహించి ఆయన ఘన స్వాగతం పలికారు.
Read Also: భారత్ తో వాణిజ్య ఒప్పందం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు!