
Modi US Tour Cancel: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై టారిఫ్ లు విధిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నెల చివరిలో అమెరికాలోని ఐక్య రాజ్యసమితిలో 80వ ఉన్నతస్థాయి సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మోదీ హాజరై ప్రసంగించాల్సి ఉంది. అయితే, ట్రంప్ విధించిన సుంకాల వైఖరిపై ఆగ్రహంతో ఉన్న ప్రధాని.. ఈ సమావేశానికి దూరంగా ఉండడంతోపాటు తన ప్రసంగాన్నీ రద్దు చేసుకున్నారు.
ప్రధానికి బదులుగా జైశంకర్ హాజరు
అటు ఐరాస సమావేశానికి ప్రధాని మోడీకి బదులుగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రసంగించే వారి పేర్లను సవరిస్తూ తాజాగా యుఎన్ఓ జాబితాను విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు జరిగే సమావేశాల్లో తొలిరోజు ప్రపంచ దేశాల నేతలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించనున్నారు. అనంతరం.. బ్రెజిల్ సహా ఇతర దేశాలకు చెందిన నాయకులు ప్రసంగిస్తారు. భారత్ తరఫున హాజరయ్యే జైశంకర్ ఈ నెల 27న మాట్లాడనున్నారు. కాగా, గత జూలైలో విడుదల చేసిన వక్తల జాబితాలో మోడీ 26వ తేదీన ప్రసంగించనున్నట్టు ఉంది. తాజాగా దానిని మార్చారు.
మలేషియా సమ్మిట్ కు వెళ్లకపోవచ్చంటూ వార్తలు
అటు అక్టోబర్ 26 నుంచి 28 వరకు మలేషియాలో ASEAN సమ్మిట్ జరగనుంది. ట్రంప్ ఈ సమావేశానికి వస్తున్నట్లు మలేషియా ప్రధాని వెల్లడించారు. అయితే, ప్రధాని మోడీ పర్యటన ఇంకా ఖారారు కాలేదు. ఈ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోడీ, ట్రంప్ మీట్ అవుతారనే వార్తలు వస్తున్నాయి. భారత్ ఆ వార్తలపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.