
PM Kisan Samman Nidhi: అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులు విడుదలయ్యాయి. వారణాసిలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ డబ్బులను విడుదల చేశారు. ఈసారి దేశ వ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.20,000 కోట్లు బదిలీ అయ్యాయి. ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి మూడు విడతల్లో రూ.6,000 ఆర్థిక సాయం అందుతుంది. ఒక్కో విడతలో రూ.2,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. అంతకు ముందు, జూన్ 18, 2024న ప్రధాని మోడీ కిసాన్ సన్మాన్ నిధులు విడుదల చేశారు. రూ.9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు వేశారు.
రూ.2,200 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
ప్రధాని మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా సుమారు రూ.2,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేశారు. వీటిలో రోడ్లు, ఆసుపత్రులు, స్కూళ్లు సహా పలు రకాల పనులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు వారణాసి ప్రజలకు మరింత ఉపయోగపడనున్నాయి. ఇలాంటి ప్రాజెక్టులు రైతుల జీవితాలు, గ్రామీణ భారతాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రధాని మోడీ తెలిపారు.
పాతాళంలో దాక్కున్నా వదలం!
వారణాసి బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోడీ.. పాకిస్తాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై దాడి చేసే వాళ్లు పాతాళంలో దాక్కున్నా వదలబోమన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచం భారత ఉగ్ర రూపాన్ని చూసిందన్న ఆయన.. పాకిస్తాన్ మరో ఉగ్ర దాడికి పాల్పడితే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.