
PM Kisan Samman Nidhi: దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు మోడీ సర్కారు శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదరు చూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులను జమ చేయనుంది. 20వ విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసింది.
నిధులు విడుదల చేయనున్న ప్రధాని మోడీ
రేపు(జూలై 17) పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన నిధులను ప్రధాని మోడీ విడుదల చేయనున్నారు. శుక్రవారం బిహార్‌లో జరిగే బహిరంగ సభలో ఆయన ఈ నిధులను విడుదల చేస్తారు. కేంద్రం ప్రతి నాలుగు నెలలకు ఒక సారి ఈ పథకం కింద నిధులు విడుదల చేస్తోంది. 19వ విడత నిధులను 2025 ఫిబ్రవరిలో విడుదల చేశారు. గతేడాది జూన్ వాయిదాను నెల ముగియక ముందే విడుదల చేశారు. అయితే, ఈసారి నిధుల విడుదలలో కాస్త ఆలస్యం అయ్యింది. పీఎం కిసాన్ ద్వారా దేశ వ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతులకు లబ్ధి కలగనుంది.
ఏపీలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ యోజనతో పాటు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం నిధులను విడుదల చేయాలని భావిస్తోంది. ఏపీ ప్రభుత్వం రూ. 5 వేలు చొప్పున రెండు సార్లు, రూ. 4 వేలు చివరి విడతలో అందించనుంది. పీఎం నిధులతో కలిపి ఏడాదిలో రైతు ఖాతాలో రూ. 20 వేలు జమ కానున్నాయి. ఇక నుంచి ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిసి తొలి విడతగా ఏప్రిల్ – జులై, రెండో విడతగా ఆగస్టు- నవంబర్, మూడో విడతగా డిసెంబర్-మార్చిలో చెల్లింపులు చేయనుంది. రేపు పీఎం కిసాన్ నిధులు విడుదల ఖాయమని చెబుతున్న అధికారులు.. ఆ సమయంలోనే అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు రెడీ అవుతున్నారు.
Read Also: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఎప్పటి వరకు అంటే..