
Pet Love: మనుషులతో పోలిస్తే కుక్కలు చూపించే ప్రేమ, ఆప్యాయత, నిబద్ధత అసాధారణం. విశ్వాసానికి ప్రతీకగా భావించే ఈ జంతువులను చాలామంది కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. ఒకరు తమ పెంపుడు కుక్క పుట్టినరోజు జరిపితే, మరొకరు దానికి ప్రత్యేకమైన డ్రెస్సులు కొనిస్తారు. పెంపుడు జంతువులపై ప్రేమ వ్యక్తం చేసే ఎన్నో రకాల మార్గాలు మనం చూసే ఉంటాం. అయితే తమిళనాడులోని ఒక కుటుంబం తమ కుక్కపై చూపిన ప్రేమ, ఆప్యాయత నెట్టింట చర్చనీయాంశమైంది. కేవలం బర్త్ డే పార్టీ కాదు, ఆ కుటుంబం నేరుగా తమ కుక్కకు శ్రీమంతం వేడుక జరిపి అందరినీ ఆశ్చర్యపరిచింది.
View this post on Instagram
సాంప్రదాయ పద్ధతిలో జరిగే శ్రీమంతం వేడుకను ప్రతీ అంశంలోనూ అంగరంగ వైభవంగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అరటి ఆకులతో అందంగా అలంకరించిన ప్రదేశంలో తెల్లటి వస్త్రంతో కప్పిన టేబుల్‌ను ఏర్పాటు చేసి దానిపై కుక్కను నిలబెట్టి దీపారాధన చేశారు. పసుపు, కుంకుమ రాసి, కొత్త దుస్తులు వేసి, పూలతో అలంకరించి, చిన్న పాపిడ బిల్లను నుదుటిపై ఉంచి సాంప్రదాయ కార్యక్రమంలా ప్రతి పద్ధతి కూడా చేశారు. హారతి ఇచ్చి, చిల్లర తిప్పి దిష్టి తీశారు. అంతేకాదు, మెడకు నెక్లెస్ వేసి ఇతర ఆభరణాలతో కూడా అలంకరించారు. నిజంగా ఒక కుటుంబ సభ్యుడికి చేసే శ్రద్ధ, ప్రేమను కుక్కపై కూడా చూపడం చూసినవారికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. వీడియో ఎక్కడ చిత్రీకరించబడిందో ఖచ్చితమైన సమాచారం లేకపోయినా ఇది తమిళనాడులో జరిగిందని భావిస్తున్నారు. నెటిజన్లు ఈ వీడియోను చూసి అత్యంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెంపుడు జంతువులపై ఇంత ప్రేమ చూపించడం హృదయాన్ని హత్తుకునే విషయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ‘జంతువులకు ఇలాంటి ప్రేమ చూపినప్పుడు మనుషుల మనసులో ఉన్న మంచితనం బయటపడుతుంది’ అని కొందరు చెప్పారు. మరికొందరు సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇలా మూగజీవాల పట్ల ప్రేమ చూపిస్తే ప్రపంచం మరింత అందంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి విస్తృతంగా షేర్ అవుతోంది.
ALSO READ: Viral video: ప్రాణం పోతున్నా పట్టించుకొని సమాజం.. మరీ ఇంత దారుణమా..?





