
ఆంధ్రప్రదేశ్ లో అధికార కూటమి ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయని తెలుస్తోంది. టీడీపీ మంత్రులు, నేతల తీరుపై ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. సీఎం చంద్రబాబుపై ఎలాంటి అసంతృప్తి లేనప్పటికి.. జిల్లాలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నారనే పవన్ భావిస్తున్నారు. ఇక జనసేన నేతలను కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ నేతల దౌర్జన్యాలపై పవన్ కు భారీగా ఫిర్యాదులు చేస్తున్నారు జనసేన నేతలు. దీంతో వరుసగా జరుగుతున్న పరిణామాలతో పవన్ కల్యాణ్ గుర్రుగా ఉన్నారని అంటున్నారు.
ఏపీ మంత్రివర్గ సమావేశం గురువారం సచివాలయంలో జరగనుంది. అయితే ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకావడం లేదని తెలుస్తోంది. టీడీపీ నేతల తీరుపై గుర్రుగా ఉన్న పవన్ కల్యాణ్.. అలిగారని.. తన అసమ్మతిని చెప్పేందుకే మంత్రివర్గ సమావేశానికి వెళ్లడం లేదనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. జనసేన నేతలు కూడా ఓపెన్ గానే ఈ విషయం చెబుతున్నారు.
మరోవైపు టీడీపీ వర్గాలు మాత్రం అలాంటిదేమి లేదని చెబుతున్నారు. వైరల్ జ్వరంతో పవన్ కల్యాణ్ ఇబ్బందిపడుతున్నారని.. అందుకే మంత్రివర్గ సమావేశానికి రావడం లేదని అంటున్నారు. పవన్ కల్యాణ్ వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు. జ్వరంతోపాటు స్పాండిలైటిస్ బాధపెడుతోందని అంటున్నారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం పవన్ కల్యాణ్ విశ్రాంతి తీసుకొంటున్నారని..గురువారం నాటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికిహాజరు కాలేకపోవచ్చని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ప్రకటన వచ్చింది.