Shashi Tharoor Meets Rahul Gandhi: కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనపై ప్రధాని మోడీ స్వయంగా ప్రశంసలు సైతం కురిపించారు. రేపు మాపో ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారనే ప్రచారమూ జోరందుకుంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా పార్లమెంట్ ప్రాంగణంలో ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గేతో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో శశిథరూర్ సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు వారితో ఈ భేటీ కొనసాగింది.
గత కొంతకాలంగా బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు
గతేడాది పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్రం.. పాకిస్థాన్‌లోని ఉగ్ర సంస్థల లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. దీంతో మోడీ ప్రభుత్వంపై శశిథరూర్ ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ నిర్వహించాల్సి వచ్చిందంటూ ప్రపంచంలోని వివిధ దేశాలకు తెలియజేయాలని కేంద్రం నిర్ణయించింది. అందుకు ఎంపీలతో కూడిన పలు ప్రతినిధి బృందాలను ఆయా దేశాలకు పంపాలని భావించింది. ఆ బృందంలో సభ్యులుగా మీ పార్టీ ఎంపీలను ఎంపిక చేసి జాబితా ఇవ్వాలంటూ కాంగ్రెస్‌కు సూచించింది. పలువురు ఎంపీలతో కూడిన జాబితాను కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ అందించింది.
కాంగ్రెస్ శశి థరూర్ పేరును చేర్చకపోయినా..
ఇక జాబితాలో శశిథరూర్ పేరును కాంగ్రెస్ పార్టీ చేర్చలేదు. కానీ ఒక ప్రతినిధి బృందంలో శశిథరూర్ పేరును కేంద్రం చేర్చింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను ఎలా ఎంపిక చేస్తారంటూ కేంద్రం వైఖరిని ఆ పార్టీ నిలదీసింది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో శశిథరూర్ పాత్ర దాదాపుగా బలహీనంగా మారింది. బీజేపీలోకి శశిథరూర్ వెళ్లిపోతున్నారంటూ ఒక ప్రచారం సైతం ఊపందుకొంది. అలాంటి వేళ పార్టీ అగ్రనేతలు రాహుల్, మల్లికార్జున ఖర్గేతో శశిథరూర్ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ భేటీలో పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వారిద్దరికి ఎంపీ శశిథరూర్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.





