
Parag Tyagi: బాలీవుడ్ నటుడు పరాగ్ త్యాగి పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ ఆయన ఫోటోను చూసిన వెంటనే మాత్రం చాలా మంది ఈ నటుడిని గుర్తుపడతారు. హిందీ సినిమాలు, టీవీ సీరియల్స్, రియాలిటీ షోలు మాత్రమే కాకుండా, తెలుగు సినిమాల్లో కూడా పవర్ ఫుల్ విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు పరాగ్ త్యాగి. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఆయన ముఖం బాగా పరిచయం. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన అజ్ఞాతవాసి, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట, విక్టరీ వెంకటేష్- యువసామ్రాట్ నాగ చైతన్య కలయికలో వచ్చిన వెంకీ మామ, నందమూరి బాలకృష్ణ నటించిన రూలర్ వంటి సినిమాల్లో విలన్ పాత్రలతో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. తెలుగులోనే కాదు, హిందీలో కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో ప్రతినాయకుడిగా మెప్పించాడు.
అయితే ఇటీవల పరాగ్ త్యాగి వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న ఓ విషాదం ఆయనను పూర్తిగా కుదిపేసింది. ఆయన భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా అకస్మాత్తుగా కన్నుమూయడం సినీ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. కాంటా లాగా అనే హిందీ సాంగ్‌తో దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న షెఫాలీ.. కేవలం 41 ఏళ్ల వయసులోనే మరణించడం అభిమానులను, సినీ ప్రముఖులను తీవ్రంగా కలచివేసింది. ఆమె మరణం తర్వాత సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో అనేక రకాల ఊహాగానాలు, రూమర్లు మొదలయ్యాయి.
ముఖ్యంగా షెఫాలీ జరీవాలా యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న కారణంగానే ఆమె మరణించిందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఈ రూమర్లు మరింత కలకలం రేపాయి. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు స్పష్టత రాకపోగా, తాజాగా పరాగ్ త్యాగి చేసిన వ్యాఖ్యలు మరో కొత్త వివాదానికి తెరలేపాయి. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న పరాగ్ త్యాగి.. తన భార్య మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఆ ఇంటర్వ్యూలో పరాగ్ మాట్లాడుతూ.. దేవుడు ఉన్న చోటే దెయ్యం కూడా ఉంటుందని వ్యాఖ్యానించాడు. నేటి సమాజంలో చాలా మంది తమ బాధలకంటే ఇతరుల ఆనందాన్ని చూసి ఎక్కువగా బాధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్యపై ఎవరో చేతబడి చేశారని తనకు తెలుసని, కానీ ఆ విషయం బయటకు చెప్పలేనని పరాగ్ పేర్కొన్నాడు. ఏదో తప్పు జరిగిందన్న భావన తన మనసులో బలంగా ఉందని, అది ఒకసారి కాదు, రెండుసార్లు తమ జీవితంలో చోటు చేసుకుందని తెలిపాడు.
మొదటిసారి ఆ పరిస్థితి నుంచి బయటపడ్డామని, కానీ రెండోసారి మాత్రం చాలా భారీగా జరిగిందని పరాగ్ వెల్లడించాడు. అసలు ఏం జరిగిందో తనకే పూర్తిగా అర్థం కాలేదని, కానీ తన భార్య మరణం సహజంగా జరగలేదన్న అనుమానం తనలో బలంగా ఉందని చెప్పాడు. పరాగ్ త్యాగి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారాయి.
షెఫాలీ జరీవాలా మరణానికి సంబంధించి ఇప్పటికే అనేక ఊహాగానాలు ఉండగా, ఆమె భర్త చేసిన ఈ వ్యాఖ్యలు వాటికి మరింత బలం చేకూర్చుతున్నాయి. అయితే ఇవి భావోద్వేగాల్లో చేసిన వ్యాఖ్యలా, లేక నిజంగా ఏదైనా అనుమానాస్పద కోణం ఉందా అన్నది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఈ వ్యాఖ్యలపై సినీ వర్గాలు, అభిమానులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పరాగ్ మాటలను ఆయన బాధలో చేసిన వ్యాఖ్యలుగా చూస్తుండగా, మరికొందరు మాత్రం ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరగాలన్న డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: Shocking: గర్ల్‌ఫ్రెండ్‌ను చంపి 7 రోజులు శవంతో దారుణానికి పాల్పడ్డ యువకుడు (VIDEO)





