
Paracetamol: పారాసిటమాల్ సాధారణంగా జ్వరాన్ని తగ్గించడానికి, తలనొప్పి, శరీర నొప్పులు, జలుబు లేదా ఫ్లూ సమయంలో కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి అత్యంత విస్తృతంగా ఉపయోగించే ఔషధాల్లో ఒకటి. సరైన మోతాదులో తీసుకుంటే ఇది సురక్షితమని వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, నొప్పిని తగ్గించడం వంటి పనుల్లో పారాసిటమాల్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందుకే చాలా మంది మొదట గుర్తుకు తెచ్చుకునే ఔషధం ఇదే. కానీ సమస్య ఈ మాత్రను ఎంత మోతాదులో తీసుకోవాలో తెలియకపోవడంలోనే ఉంటుంది. పారాసిటమాల్‌ను నిర్దేశించిన పరిమితి మించినప్పుడు అది శరీరానికి, ముఖ్యంగా కాలేయానికి తీవ్రమైన నష్టం కలిగించగలదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రోజువారీగా ఒక పెద్దవాడు తీసుకోవాల్సిన గరిష్ట మోతాదు 4 గ్రాములను మించకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిమితిని దాటితే కాలేయానికి తీవ్రమైన నష్టం కలిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే పారాసిటమాల్‌ను అధిక మోతాదులో తీసుకున్నప్పుడు లివర్ దానిని విరగదీసి శరీరం నుంచి బయటకు పంపే శక్తి తగ్గిపోతుంది. ఈ విషపదార్థాలు లివర్‌లో నిల్వవుతూ కణాలను దెబ్బతీసి, చివరకు లివర్ ఫెయిల్యూర్ వరకు దారితీస్తాయి. చాలా సందర్భాల్లో ప్రజలు గమనించకుండా రోజు మొత్తం నొప్పి కోసం, జ్వరానికి, జలుబుకు తీసుకునే అనేక రెడీమేడ్ ట్యాబ్లెట్స్‌లో కూడా పారాసిటమాల్ మిశ్రమంగా ఉండటం వల్ల తెలియకుండానే అధిక మోతాదు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
ముఖ్యంగా జలుబు, దగ్గు, ఫ్లూ కోసం ఇచ్చే కాంబినేషన్ ట్యాబ్లెట్స్‌లో కూడా పారాసిటమాల్ ఉంటుంది. అందువల్ల రోజుకు ఎంత తీసుకుంటున్నాం అన్నది సరిచూసుకోవడం తప్పనిసరి. ఒక్కోసారి జ్వరానికి వేరు పారాసిటమాల్ వేసుకుంటారు. అదే రోజు జలుబు ట్యాబ్లెట్ కూడా వేసుకుంటారు. ఆ ట్యాబ్లెట్‌లో కూడా ఇదే పదార్థం ఉంటుంది కాబట్టి అనుకోకుండా గరిష్ట మోతాదును మించి తీసుకునే ప్రమాదం ఉంటుంది.
ఇంకా ఒక ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే.. ఆల్కహాల్ సేవించిన సమయంలో, అలాగే ఉపవాసం ఉన్నప్పుడు పారాసిటమాల్ తీసుకోవడం చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. శరీరం ఖాళీగా ఉన్నప్పుడు లేదా మద్యం ప్రభావంలో ఉన్నప్పుడు లివర్ పని తక్కువగా ఉంటుంది. అప్పుడు పారాసిటమాల్ బయటకు పంపే శక్తి తగ్గిపోతుంది. అలా తీసుకుంటే చిన్న మోతాదే అయినా అది లివర్‌కు హానికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు పరిస్థితుల్లో పారాసిటమాల్ వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే చిన్నపిల్లలు, వృద్ధులు, ముందుగానే లివర్ సమస్యలు ఉన్నవారు, మధుమేహం లేదా రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు పారాసిటమాల్ వాడేటప్పుడు వైద్యుడి సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. డోసేజీ వయసు, బరువు, ఆరోగ్య పరిస్థితి ఆధారంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. స్వయంగా మోతాదును నిర్ణయించుకోవడం ప్రమాదకరం. నెలకు తరచూ పారాసిటమాల్ వాడుతున్నా, నొప్పి కోసం తరచూ తీసుకుంటున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. శరీరంలో నొప్పి తరచూ వస్తే అది వేరే సమస్యకు సంకేతం కావచ్చు. పారాసిటమాల్‌తో అణిచివేయడం కన్నా అసలు కారణాన్ని తెలుసుకోవడమే ఆరోగ్యకరం.
ALSO READ: Health: శీతాకాలం మీ శరీరం వెచ్చగా ఉండాలంటే..





