
శంషాబాద్, (క్రైమ్ మిర్రర్) :- అవినీతి నిరోధక శాఖ (ACB) ఏర్పాటు చేసిన పక్కా ప్రణాళికలో చిక్కినప్పటికీ, లంచం డబ్బుతో పాటు పారిపోయిన ఓ పంచాయతీ కార్యదర్శి ఘటన రంగారెడ్డి జిల్లాలో సంచలనం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం, శంషాబాద్‌లోని రద్దీగా ఉండే ఓ హోటల్ సమీపంలో ఇన్మల్ నర్వ గ్రామ పంచాయతీ కార్యదర్శి కే.సురేందర్ (కొత్తూరు మండలం) ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే అప్రమత్తమైన సురేందర్ వెంటనే అతడు వచ్చిన కారులో రూ.50 వేల లంచం డబ్బుతో పరారయ్యాడు.
ఆలయంలో తొక్కిసలాటలో ఆరుగురు మృతి, 25 మందికి పైగా గాయాలు
వివరాల్లోకి వెళ్తే…ఇన్మల్ నర్వ గ్రామంలో ఫిర్యాదుదారు ఓ భవనాన్ని నిర్మిస్తుండగా, దానిపై నోటీసులు ఇవ్వకుండా ఉండేందుకు కార్యదర్శి సురేందర్ లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. మొదట 50 వేల రూపాయలను శంషాబాద్‌లోని హోటల్ దగ్గర తీసుకురమ్మని సూచించాడు. బాధితుడు వెంటనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం హోటల్ సమీపంలో మాటు వేసి, నిఘా పెట్టారు. సరిగ్గా అదే సమయంలో కారులో వచ్చిన సురేందర్, బాధితుడి నుంచి 50 వేల రూపాయలు తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ అతడు తన కారుతో పారిపోయాడు. వెంటనే వెంబడించినా ప్రయోజనం లేకుండా పోయింది.
కొండాపూర్‌లో డ్రగ్స్‌తో రేవ్ పార్టీ భగ్నం.. 11 మంది అరెస్ట్
ఏసీబీ అధికారులు నేరుగా అతని ఇంటికి వెళ్లగా, అక్కడ అతడు కనిపించలేదు. స్థానికుల సమాచారం మేరకు అతని బంధువుల ఇళ్ల వద్ద కూడా ఆరా తీశారు. చివరకు అతను ప్రయాణించిన కారును, లంచంగా తీసుకున్న డబ్బుతో సహా అతని బంధువుల ఇంట్లో గుర్తించారు. కానీ నిందితుడు అక్కడ లేకపోవడంతో, కారును సీజ్ చేశారు. శనివారం కూడా కొత్తూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో సురేందర్ ఆచూకీ లభించలేదు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ సంఘటనతో ఇన్మల్ నర్వ గ్రామంతో పాటు కొత్తూరు మండలంలోనూ సంచలనం రేగింది.