
Panchayat Elections: తెలంగాణ తొలి దశ పంచాయతీ ఎన్నికలు గురువారం ఎటువంటి పెద్ద అంతరాయం లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 4,236 పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. వీటిలో 3,836 గ్రామ పంచాయతీలలో ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఈ విడతలో పోలింగ్ శాతం 84.28 నమోదు కావడం ప్రజాస్వామ్యంపై గ్రామీణ ప్రాంత ప్రజల విశ్వాసాన్ని మరోసారి రుజువు చేసింది. ముఖ్యంగా యాదాద్రి జిల్లాలో 92.88 శాతం పోలింగ్ నమోదై రాష్ట్రంలోనే అత్యధిక ఓటింగ్ శాతాన్ని సొంతం చేసుకుంది.
రాజకీయ సమీకరణాల పరంగా చూస్తే.. ఈ దశలో కాంగ్రెస్ మద్దతుదారులు స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఫలితాల విశ్లేషణలో కాంగ్రెస్ అభ్యర్థులు మొదటి స్థానంలో నిలవగా, గతంలో గ్రామీణ ప్రాంతాలలో బలమైన పట్టున్న బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. మరోవైపు బీజేపీ కంటే ఇతర స్వతంత్ర, ప్రాంతీయ అభ్యర్థులు ఎక్కువ సీట్లు సాధించడం విశేషం.
ఈ ఎన్నికలలో అత్యంత ఆసక్తికరంగా నిలిచిన విషయం ఏంటంటే.. అనేక గ్రామాలలో ఒకే ఓటు తేడాతో నిర్ణయాలు రావడం. కొంతమంది అభ్యర్థుల అదృష్టాన్ని ఒక్క ఓటు మార్చేస్తే, మరికొన్ని చోట్ల చెల్లని ఓట్లు సమీకరణాలను పూర్తిగా తలకిందులు చేశాయి. కొన్నిచోట్ల రీకౌంటింగ్, మరికొన్నిచోట్ల డ్రా వరకు వెళ్లి విజేతలను నిర్ణయించడం ఈ ఎన్నికలకు ప్రత్యేకతను తీసుకువచ్చింది.
కుమురం భీం జిల్లా- ఒక్క ఓటు చెప్పిన తీర్పు
కెరమెరి మండలంలోని పరందోలి గ్రామంలో రాథోడ్ పుష్పలత విజయం నిజంగా నిమిషాల వ్యవధిలో మారిపోయే ఎన్నికల గమనాన్ని ప్రతిబింబించింది. మొత్తం 873 ఓట్లలో పుష్పలత 102 ఓట్లు సాధించగా, ఆమె సమీప ప్రత్యర్థి దిలీప్ 101 ఓట్లతో కేవలం ఒకే ఓటు తేడాతో ఓడిపోయాడు. ఏడు మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, చివరకు అదృష్టం పుష్పలత వైపు నిలిచింది.
కామారెడ్డి జిల్లా- నడిమి తండాలో మరో సింగిల్ ఓటు ఆద్యాయం
రాజంపేట మండలంలోని నడిమి తండాలో బానోత్ లక్ష్మి కూడా ఇలాంటి అదృష్టానందం పొందిన అభ్యర్థుల్లో ఒకరు. 290 ఓట్లు సాధించిన లక్ష్మి, 289 ఓట్లు పొందిన బానోత్ సునీతను కేవలం ఒక్క ఓటుతో వెనక్కు నెట్టి తమ విజయాన్ని అందుకుంది.
నిర్మల్ జిల్లా- సమాన ఓట్లు, చెల్లని ఓటు నిర్ణయించిన గెలుపు
కడెం మండలం కల్లెడలో పరిస్థితి మరింత ఉత్కంఠభరితంగా మారింది. తాటి రుక్మిణీదేవి, వెంబడి లక్ష్మి ఇద్దరూ 343 ఓట్లు సాధించడంతో సమాన ఫలితాలు వచ్చాయి. అయితే లక్ష్మికి వచ్చిన ఓట్లలో ఒకటి చెల్లనిదిగా తేలడంతో, రీకౌంటింగ్ అనంతరం రుక్మిణీదేవి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.
జనగామ జిల్లా- సమాన ఓట్లు, చివరికి డ్రాలో విజేత
ఎల్లారెడ్డిగూడెంలో గంపల నర్సయ్య, గడ్డం జోజి మధ్య జరిగిన పోటీలో కూడా అదే పరిస్థితి. మొదట జోజి 211 ఓట్లు, నర్సయ్య 210 ఓట్లు సంపాదించారు. రీకౌంటింగ్‌లో జోజికి వచ్చిన ఓట్లలో ఒకటి చెల్లనిదిగా తేలడంతో ఇరువురికి చెరో 210 ఓట్లు వచ్చాయి. నియమాల ప్రకారం డ్రా చేపట్టగా జోజి విజేతగా ప్రకటించారు.
నిజామాబాద్ జిల్లా- మూడు సార్లు లెక్కించిన ఓట్ల ఉత్కంఠ
కల్దుర్కి గ్రామంలో నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ మధ్య ఉత్కంఠభరిత పోటీ జరిగింది. మొదటి లెక్కింపులో నరేందర్ రెడ్డి 866 ఓట్లు, శ్రీనివాస్ 863 ఓట్లు పొందారు. అభ్యంతరం కారణంగా రీకౌంటింగ్ జరిగి చెల్లని ఓట్లు తొలగించడంతో నరేందర్ రెడ్డి 861, శ్రీనివాస్ 860 ఓట్లు నమోదు అయ్యాయి. తదనంతరం మూడోవారికీ లెక్కింపు జరిపినా ఫలితం మారలేదని అధికారులు ప్రకటించారు.
ఈ మొత్తం పరిణామాలు చూస్తే గ్రామీణ ప్రజల ఓటు ఎంత అమూల్యమో, ఒక్క ఓటు కూడా ఎలాంటి మార్పు తీసుకురాగలదో మరోసారి స్పష్టమవుతోంది. ప్రజాస్వామ్య పాఠశాలలో తొలి విడత గ్రామీణ ఓటర్లు రాష్ట్రానికి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు.. ప్రజాస్వామ్యం అంటే ఒక్కో ఓటులో ఉన్న విలువ అని.
ALSO READ: Rajinikanth 76: వన్ అండ్ ఓన్లీ సూపర్‌స్టార్.. హ్యాపీ బర్త్‌డే తలైవా..





