Opposition Leaders Arrested In Nalgonda: తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నల్లగొండ జిల్లా దేవరకొండలో ఇవాళ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విపక్ష నాయకుల అరెస్ట్ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్, బిజెపి నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. సీఎం పర్యటనను అడ్డుకుంటారనే కారణంతో అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలిస్తున్నారు.
పిల్లి రామరాజు సహా పలువురి అరెస్ట్
నల్లగొండ పట్టణంలో తెల్లవారుజాము నుంచే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్య శ్రీనివాస్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మాతంగి అమర్, మైనార్టీ యూత్ ప్రెసిడెంట్ అవేస్ షా, మైనారిటీ నాయకుడు శంషాద్దీన్ ను పోలీసులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు గడ్డం మహేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాఖీ సహా అక్కెనపల్లి బలరాం, యాదగిరాచారి పలువురిని ఉదయాన్నే అదుపులోకి తీసుకున్నారు.
అక్రమ అరెస్టులపై కోర్టుకు వెళ్తాం: పిల్లి రామరాజు
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లాలోని విపక్ష నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని బీజేపీ నేత పిల్లి రామరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో లబ్ది కోసమే సీఎం రేవంత్ రెడ్డి, దేవరకొండకు సభ పెడుతున్నారు తప్ప, ఈ పర్యటనతో నల్లగొండ జిల్లాకు ఒరిగేదేమీ లేదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. నిరసనకు గల కారణాన్ని తెలుసుకుని పరిష్కరించాలే తప్ప, విపక్ష నాయకులను అరెస్ట్ చేస్తే నిరసనలు ఆగుతాయనుకోవడం హాస్యాస్పదం అన్నారు. ప్రభుత్వమే ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డం దుర్మార్గం అన్నారు. ముఖ్యమంత్రుల పర్యటన సందర్భంగా విపక్షనాయకులను అరెస్ట్ చేయడంపై కోర్టుకు వెళ్తామన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతామన్నారు పిల్లి రామరాజు.
దేవరకొండలో ముఖ్యమంత్రి పర్యటన
తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ దేవరకొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్నారు. సీఎం పర్యటనలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీలో భాగంగా రూ.11.33 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేయనున్నారు. దేవరకొండ బీఎన్‌ఆర్ కాలనీలో రూ.2 కోట్లతో పార్కు నిర్మాణం, ప్రభుత్వ బాలుర కాలేజీలో రూ.2 కోట్లతో స్టేడియం, వాకింగ్ ట్రాక్ నిర్మాణం, రూ.2.50 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం శేరిపల్లి దగ్గర ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఈ సభకు హాజరుకానున్నారు.





