
One Vote Victory: సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన గ్రామాల్లో ఆనందం, ఆవేదన రెండూ కలగలిసిన వాతావరణం కనిపించింది. గెలుపొందిన అభ్యర్థులు, వారి అనుచరులు సంబరాల్లో మునిగితేలుతుండగా, పదవి దక్కని వారు మాత్రం అదృష్టం కలిసి రాలేదంటూ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ముఖ్యంగా ఒక్క ఓటు, రెండు ఓట్లు తేడాతో ఫలితాలు తేలిన ఘటనలు ఎక్కువగా చోటుచేసుకోవడం గమనార్హం. కొన్ని గ్రామాల్లో ఐదారు ఓట్ల ఆధిక్యంతో సర్పంచ్‌లు గెలవగా.. మరికొన్ని చోట్ల కేవలం ఒక్క ఓటే విజయం, ఓటమి మధ్య తేడాగా నిలిచింది. ఒక్క ఓటు విలువ ఎంత కీలకమో ఈ ఎన్నికలు మరోసారి నిరూపించాయి.
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. ఆదివారం జరిగిన పోలింగ్‌లో ముత్యాల శ్రీవేద, ఆమె ప్రత్యర్థి అర్ష స్వాతికి చెరో 180 ఓట్లు వచ్చాయి. దీంతో ఫలితం తేలక అధికారులు పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించగా, అక్కడ నమోదైన ఒక్క బ్యాలెట్ ఓటు శ్రీవేదకు రావడంతో ఆమె సర్పంచ్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. విద్యావంతురాలైన యువతి కావడంతో ఈ గెలుపు గ్రామంలో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. పోస్టల్ బ్యాలెట్ రూపంలో వచ్చిన ఒక్క ఓటే ఆమె భవితవ్యాన్ని మార్చేసింది.
నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామంలోనూ ఇలాగే ఉత్కంఠభరిత పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగిన తిరుపతమ్మకు 605 ఓట్లు రాగా, బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన పద్మమ్మకు 604 ఓట్లు వచ్చాయి. కేవలం ఒక్క ఓటు ఆధిక్యంతో తిరుపతమ్మ విజయం సాధించారు. ఫలితంపై అనుమానం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు రీ కౌంటింగ్ కోరడంతో అధికారులు మూడు సార్లు ఓట్లు మళ్లీ లెక్కించారు. మూడు సార్లూ ఫలితం మారకపోవడంతో చివరకు తిరుపతమ్మ గెలుపు ఖరారైంది.
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం గూడూరు గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూడా నరాలు తెగేంత ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ మద్దతుతో శేఖర్, కాంగ్రెస్ రెబల్‌గా భీమన్న గౌడ్ పోటీ చేశారు. మొదట లెక్కింపులో ఇద్దరికీ చెరో 280 ఓట్లు రావడంతో అధికారులు టైగా ప్రకటించి టాస్ వేయాలని సూచించారు. అయితే ఇద్దరు అభ్యర్థులు దీనికి అంగీకరించక రీ కౌంటింగ్ కోరారు. మళ్లీ లెక్కింపు జరిపిన తర్వాత భీమన్నకు ఒక్క ఓటు అధికంగా రావడంతో ఆయనను విజేతగా ప్రకటించారు.
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన గొల్ల రమాదేవి, సమీప ప్రత్యర్థి మౌనికపై కేవలం ఒక్క ఓటుతో గెలిచారు. అదే తరహాలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గుండాల గ్రామంలో నక్క బుచ్చిరెడ్డి ఒక్క ఓటు మెజార్టీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి కాంతారెడ్డిపై స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం ధన్ సింగ్ తండాలోనూ ఇదే తరహా ఫలితం నమోదైంది. ధనావత్ ధూప్ సింగ్, మెగావత్ భాస్కర్ నాయక్‌పై ఒక్క ఓటు ఆధిక్యంతో గెలుపొందారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్‌పూర్ గ్రామంలో వడ్లకొండ వెంకటేశ్‌కు 449 ఓట్లు రాగా, ప్రత్యర్థి వేగుర్ల ఎల్లయ్యకు 448 ఓట్లు మాత్రమే రావడంతో వెంకటేశ్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి గ్రామంలో ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఎస్సీ అభ్యర్థులు లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమవుతుందని మొదట భావించారు. అయితే అనూహ్యంగా రాయపురం నవ్యశ్రీ నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ తప్పలేదు. పోలింగ్‌లో మొత్తం 1,451 ఓట్లు పోలవగా, కొంగర మల్లమ్మకు 705, నవ్యశ్రీకి 704 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు ఆధిక్యంతో మల్లమ్మ గెలుపొందడంతో పాటు హ్యాట్రిక్ సాధించగా, గ్రామంలో సంబరాలు అంబరాన్ని తాకాయి.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం మల్లయ్యపల్లి గ్రామంలో జాటోత్ గణేశ్ తొలుత రెండు ఓట్ల ఆధిక్యంతో ఉన్నట్లు లెక్కలు చూపించాయి. దీనిపై ప్రత్యర్థి జర్పుల హేమూ నాయక్ రీ కౌంటింగ్ కోరుతూ ఆందోళనకు దిగారు. మళ్లీ లెక్కింపు చేసిన అనంతరం గణేశ్‌కు ఒక్క ఓటు ఆధిక్యం మాత్రమే ఉన్నట్లు తేలడంతో ఆయనను విజేతగా అధికారులు ప్రకటించారు.
ALSO READ: Politics: తెలంగాణలో మంత్రివర్గం విస్తరణ.. వీరికి ఛాన్స్!





