హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: దేశవ్యాప్తంగా భూములు ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఒకే విధమైన విధానంలోకి తీసుకురావడమే వన్‌నేషన్- వన్ రిజిస్ర్టేషన్ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో వేర్వేరు రిజిస్ట్రేషన్ విధానాలు, సాఫ్ట్‌వేర్‌లు ఉన్నాయి. దీనివల్ల పారదర్శకత లోపించడమే కాకుండా, భూ వివాదాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీనికి పరిష్కారంగా కేంద్రం నేషనల్ జెనరిక్ డ్యాకుమెంట్ రిజిస్ర్టేషన్ సిస్టం( NGDRS ) అనే కేంద్రీకృత వ్యవస్థను ప్రవేశపెడుతోంది.
ఈ పథకంలో భూమికి (ULPIN) ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. దీనిని భూమికి ఇచ్చే ఆధార్ కార్డ్‌గా భావించవచ్చు. దీంతోదేశంలోని ఏ ప్రాంతం నుంచైనా సరే, ఏ రాష్ట్రంలోని ఆస్తి వివరాలనైనా ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకునే వీలు కలుగుతుంది. స్థానిక భాషలతో పాటు ఇంగ్లీష్ లేదా హిందీలో కూడా పత్రాలను సిద్ధం చేసుకునే సౌకర్యం ఉంటుంది.
అవినీతికి అడ్డుకట్ట…
పనుల్లోపారదర్శకతతో పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట పడుతుంది. దళారుల ప్రమేయం తగ్గుతుంది. ఆస్తుల వివరాలు అన్నీ ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల వెరిఫికేషన్ వేగంగా పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా వేగవంతమవుతుంది. భూ వివాదాల నివారణ: ఒకే భూమిని ఇద్దరు ముగ్గురికి అమ్మడం వంటి మోసాలను ఈ వ్యవస్థ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. రుణ సౌకర్యం: బ్యాంకులు భూమి పత్రాలను ఆన్‌లైన్‌లోనే వెరిఫై చేయగలుగుతాయి కాబట్టి, రైతులకు లేదా సామాన్యులకు రుణాలు త్వరగా మంజూరవుతాయి.
అనేక రాష్ర్టాల్లో…
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ఈ విధానాన్ని అమలు చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే తమ భూ రికార్డులను గణనీయంగా డిజిటలైజ్ చేశాయి. అయితే, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల డేటాను ఒకే సర్వర్‌కు అనుసంధానించడం ఇప్పుడున్న అతిపెద్ద సవాలు. దీనికోసం కేంద్రం రాష్ట్రాలకు ఆర్థిక ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది.ఈ విధానం పూర్తిగా అమలులోకి వస్తే, స్థిరాస్తి (Real Estate) రంగంలో పెను మార్పులు వస్తాయని, పెట్టుబడిదారులకు, సామాన్య ప్రజలకు తమ ఆస్తులపై భద్రత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
