
CM Omar Abdullah Climbs Wall: జమ్మూకాశ్మీర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 1931లో చనిపోయిన వారికి నివాళులర్పించే విషయంలో దుమారం చెలరేగింది. గవర్నర్ మనోజ్ సిహ్హ ఆదేశాలతో నౌహట్టాలోని మజర్ ఏ శుహదా శ్మశానవాటికలోని సమాధుల దగ్గరికి ఎవరూ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. అమరవీరుల దినం నిర్వహించకుండా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేతలను హౌస్ అరెస్టు చేశారు. సీఎం ఒమర్ అబ్దుల్లాను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. శ్మశానవాటిక గేటుకు కూడా తాళాలు వేశారు.
గోడ దూకిన సీఎం ఒమర్ అబ్దుల్లా
అటు గవర్నర్ ఆంక్షలను ధిక్కరించి సీఎం ఒమర్ అబ్దుల్లా ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చారు. నేరుగా స్మశానవాటికకు చేరుకున్నాడు. అక్కడ భద్రతా సిబ్బంది ఆయను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు గోడదూకి స్మశానం లోపలికి వెళ్లారు. 1931 మృతులకు నివాళులర్పించారు.
అక్రమంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు!
ఇక పోలీసులు తనను అడ్డుకోవడంపై ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిక కాని ప్రభుత్వం తనను అడ్డుకునే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు నౌహట్టా చౌక్ నుంచి నడిచి వెళ్లేలా చేసిందన్నారు. గేటును బ్లాక్ చేయడంతో గోడ దూకాల్సి వచ్చిందన్నారు. నన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించినా, ఆపలేకపోయారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమీ చట్టవిరుద్ధం వ్యవహరించడం లేదన్నారు. చట్టాలను కాపాడుతామని చెప్పుకునే వారు, తనను ఏ చట్టం ప్రకారం అడ్డుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇంతకీ ఏంటి వివాదం?
కశ్మీర్ చరిత్రలో 1931 జూలై 13న జరిగిన ఘటనను అత్యతం ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. దేశ స్వాతంత్ర్యం సంగ్రామం వేళ.. అక్కడి పాలకుడు మహారాజా హరిసింగ్ కు వ్యతిరేకంగా శ్రీనగర్ జైలు బయట ఆందోళన చేస్తున్న అబ్దుల్ ఖాదిర్ మద్దతుదారులపై బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 22 మంది చనిపోయారు. నాటి ఘటనను స్మరించుకుంటూ ఏటా జూలై 13న అమరవీరుల దినోత్సవం జరుపుకుంటారు.