
Nimisha Priya Case: యెమన్ లో ఉరిశిక్ష పడిన కేరళ నర్సు నిమిష ప్రియ అంశంపై భారత విదేశాంగ శాఖ మరోసారి స్పందించింది. ఈ అంశం చాలా సున్నితమైనదని ప్రకటించింది. ఈ విషయంలో తాము నిమిష కుటుంబానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కీలక ప్రకటన చేశారు.”ఈ కేసు చాలా సున్నితమైన అంశం. భారత ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తోంది. నిమిష ప్రియ కుటుంబం కోసం ఓ లాయర్ ను ఏర్పాటు చేసి న్యాయ సహకారం అందిస్తున్నాం. కాన్సులార్ విజిట్స్ కు అవకాశం కల్పించాం. స్థానిక అధికారులతో, కుటుంబ సభ్యులతో నిరంతరం టచ్ లో ఉన్నాం. కేసును సామరస్య పూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. చర్చలు జరిపేందుకు అదనపు సమయం కావాలని కోరాం. ఇందుకు అనుగుణంగానే యెమెన్ అధికారులు ఉరిశిక్ష అమలును వాయిదా వేశారు. ఈ విషయంలో మిత్ర దేశాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం” అన్నారు.
నిమిషకు ఉరిశిక్ష ఎందుకు పడింది?
యెమన్ కు చెందిన తన బిజినెస్ పార్ట్ నర్ తలాల్ అబ్దో మెహదీకి మత్తు మందు ఇచ్చి హత్య చేసినట్లు నిమిష ప్రియ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో నర్సుతో కలిసి ఆమె ఈ హత్య చేసినట్టు అభియోగాలు నమోదయ్యాయి. నిమిష ప్రియ ఈ ఆరోపణలను ఖండించింది. అయినా, కోర్టు ఆమె పిటిషన్లను కొట్టేసింది. మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కూడా యెమెన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ ఏడాది జనవరిలో యెమెన్ సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ అధ్యక్షుడు మెహదీ అల్ మషాత్ మరణ శిక్ష అమలుకు ఆదేశాలు జారీ చేశారు.
ఎవరీ నిమిష ప్రియ?
కేరళలోని పాలక్కాడ్ కు చెందిన నిమిష నర్సింగ్ పూర్తి చేసి, 2008లో యెమన్ కు వెళ్లింది. ఆ తర్వాత 2011లో తిరిగి వచ్చి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి యెమన్ వెళ్లింది. 2014 యెమన్ అంతర్యుద్ధం సమయంలో ఆమె భర్త, కూతురు ఇండియాకు వచ్చారు. ఆమె యెమన్ లోనే ఉన్నది. అదే సమయంలో మెహదీతో కలిసి ఆమె ఓ నర్సింగ్ హోం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆమె పాస్ పోర్టు దాచి పెట్టుకుని ఇవ్వకుండా మెహదీ ఇబ్బంది పెట్టాడు. తనను తాను కాపాడుకునేందుకు అతడికి మత్తుమందు ఇచ్చింది ఓవర్ డోస్ కారణంగా అతడు చనిపోయాడు. ఈ కేసులు ఆమెకు ఉరిశిక్ష పడింది. మరోవైపు బ్లడ్ మనీకి అంగీకరించేది లేదని మెహదీ కుటుంబం తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈ కేసు విషయం తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది.
Read Also: ఇజ్రాయెల్ ఓ క్యాన్సర్ కణితి, ఇరాన్ చీఫ్ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు!