Hair Colour Row: ఎర్రజుట్టు ఓ పోలీస్ అధికారి కొంపముంచింది. స్టైల్ కోసం జుట్టుకు ఎర్ర రంగు వేసుకోవడంతో ఆ అధికారి ఉద్యోగం పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన ఒడిశాలో జరిగింది. 49 ఏళ్ల రష్మీ రంజన్ దాస్ జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో డీఎస్పీగా పని చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన తన జుట్టుకు ఎర్ర రంగు వేసుకోవటం మొదలెట్టారు. ఆ ఎర్ర జుట్టును చూసి తోటి పోలీసులతో పాటూ సాధారణ జనం కూడా ఆశ్చర్యపోతున్నారు.
దాస్ జుట్టు రంగుపై ఉన్నతాధికారుల సీరియస్
దాస్ జుట్టు రంగుపై ఉన్నతాధికారులు అనధికారికంగా హెచ్చరించారు. జుట్టుకు నల్ల రంగు వేసుకోమని చెప్పారు. అయితే వారి మాటల్ని రష్మీ రంజన్ దాస్ పట్టించుకోలేదు. తాజాగా రష్మీ రంజన్ దాస్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎర్ర జుట్టుపై చర్చ మొదలైంది. విషయం ఇన్‌స్పెక్టర్ జనరల్ (సెంట్రల్ రేంజ్) సత్యజిత్ నాయక్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన రష్మీ రంజన్ దాస్ ప్రవర్తనపై సీరియస్ అయ్యారు. దాస్‌ను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్‌కు అటాచ్ చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలో సస్పెన్షన్ వేటు వేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది.
అధికారులు ఏం అంటున్నారంటే?
పోలీస్ శాఖలో ఉండే ప్రతి ఒక్కరూ యూనీఫామ్‌కు గౌరవం ఇవ్వాలి. క్రమ శిక్షణ, ప్రజా సేవకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అని ఐజీ సత్యజిత్ నాయక్ తేల్చి చెప్పారు. డీఎస్పీపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల హెయిర్ స్టైల్ ఎలా ఉండాలో పోలీస్ రూల్స్‌లో స్పష్టంగా లేదు. కానీ.. క్రమ శిక్షణ, నిరాడంబరత ఉండాలని అధికారులు వెల్లడించారు. ఈ కాంట్రవర్సీపై దాస్ స్పందించడానికి ఇష్టపడటం లేదు. ఉన్నతాధికారులు దాస్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.





