
Rajnath Singh: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ లతో భారత్ పై తన అక్కసు వెళ్లగక్కుతున్న వేళ.. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ దేశానికి శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు కాని ఉండరని చెప్పుకొచ్చారు. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. టారిఫ్‌ల కారణంగా అమెరికాతో దూరం పెరుగుతూ, చైనాతో భారత్ బంధం బలపడుతున్న వేళ రాజ్ నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న రాజ్ నాథ్.. ఆత్మనిర్భర భారత్, స్వావలంబన గురించి ప్రస్తావించారు. ఐఎన్‌ఎస్ హిమగిరి, ఐఎన్‌ఎస్ ఉదయగిరి సహా దేశీయంగా అభివృద్ధి చేసిన రెండు నీలగిరి తరగతి స్టెల్త్ ఫ్రిగేట్ లను ప్రారంభించడంతో పాటు స్వదేశీకరణలో గణనీయమైన పురోగతి సాధించినట్టు వివరించారు. యుద్ధ నౌకలను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయకూడదని నేవీ నిర్ణయించుకుందని చెప్పారు.
చైనా అధ్యక్షుడితో ప్రధాని మోడీ సమావేశం
అటు ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం చైనాకు వెళ్లారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా 20 మంది ప్రపంచ నేతలు పాల్గొనే షాంఘై సహకార సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఇప్పటికే చైనాకు చేరిన ప్రధానికి టియాంజిన్ ఎయిర్ పోర్ట్ లో ప్రధానికి రెడ్ కార్పెట్ వేసి అక్కడి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఇవాళ చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.