
అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గం పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో ఉన్న శ్రీ సంజీవరాయ ఆంజనేయ స్వామి ఆలయం ప్రత్యేక సంప్రదాయానికి నిలయంగా కొనసాగుతోంది. శతాబ్దాలుగా కొనసాగుతున్న మగవారి పొంగళ్లు పండుగ ఈ ఏడాదీ సంక్రాంతికి ముందు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పండుగ తిప్పాయపల్లె గ్రామానికి మాత్రమే పరిమితం కాకుండా పరిసర గ్రామాల నుంచి కూడా భక్తులను ఆకర్షిస్తోంది.
ప్రతి సంవత్సరం ఈ ప్రత్యేక రోజున గ్రామంలోని పురుషులు మాత్రమే ఈ పండుగలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లిన వారు కూడా ఈ రోజున తప్పకుండా గ్రామానికి చేరుకుంటారు. తమ తమ ఇళ్ల నుంచి బియ్యం, పాలు, బెల్లం వంటి వంట సామాగ్రిని తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలోనే పొంగళ్లు వండి సంజీవరాయ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. గ్రామస్తులు ఈ పండుగను సాధారణ సంక్రాంతి కన్నా కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.
ఈ ఆలయంలో ఈ ఒక్కరోజు మహిళలకు ప్రత్యేక నిబంధనలు అమలులో ఉంటాయి. మహిళలు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉండదు. అలాగే స్వామివారికి సమర్పించిన పొంగళ్లను ప్రసాదంగా స్వీకరించరు. ఆలయం వెలుపల నుంచే దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. పురుషులే పొంగళ్లు వండటం, నైవేద్యం సమర్పించడం ఈ సంప్రదాయంలో ప్రధాన భాగంగా కొనసాగుతోంది.
ఈ సంప్రదాయానికి వెనుక ఉన్న కథను గ్రామ పెద్దలు తరతరాలుగా చెబుతున్నారు. అనేక శతాబ్దాల క్రితం ఒక సాధువు తిప్పాయపల్లె గ్రామాన్ని సందర్శించాడని, అతడు పురుషుల చేతుల ద్వారా వచ్చిన ఆహారాన్ని మాత్రమే స్వీకరించాడని స్థానికుల నమ్మకం. మహిళల నుంచి వచ్చిన నైవేద్యాలను ఆయన తిరస్కరించాడని చెబుతారు. వెళ్లే ముందు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి సంజీవరాయగా నామకరణం చేశాడని, కొన్ని ప్రత్యేక ఆచారాలను పాటించాలని గ్రామస్తులకు సూచించాడని కథనం.
ఆ సాధువు ఆలయానికి గోపురం లేదా గర్భగుడి నిర్మించవద్దని ఆదేశించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అందుకే నేటికీ ఈ ఆలయానికి గోడలు మాత్రమే ఉండగా, సంప్రదాయబద్ధంగా పూజలు జరుగుతున్నాయి. ఆధునిక నిర్మాణాలు లేకుండానే స్వామివారి కృప గ్రామంపై ఉందన్న నమ్మకం బలంగా ఉంది.
మరో కథనం ప్రకారం ఒకప్పుడు తిప్పాయపల్లె గ్రామంలో తీవ్ర కరువు ఏర్పడింది. వర్షాలు లేక పంటలు పండక ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నారు. అటువంటి సమయంలో ఒక బ్రాహ్మణుడు గ్రామానికి వచ్చి సంజీవరాయ స్వామిని పూజించాలని సూచించాడని చెబుతారు. ఆ తర్వాత వర్షాలు కురిసి పంటలు పండాయని, గ్రామం మళ్లీ సుభిక్షంగా మారిందని స్థానికులు విశ్వసిస్తున్నారు. అప్పటి నుంచి పురుషులు మాత్రమే పొంగళ్లు సమర్పించే సంప్రదాయం ప్రారంభమైందని అంటున్నారు.
ఈ పండుగ గ్రామాన్ని దుష్ట శక్తుల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతుందని గ్రామస్తుల విశ్వాసం. ప్రతి ఏడాది ఈ పండుగ ఘనంగా జరిగితే గ్రామానికి మంచి జరుగుతుందని నమ్ముతారు. అందుకే తిప్పాయపల్లెతో పాటు పొరుగు గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ప్రత్యేక పండుగను వీక్షించేందుకు తరలివస్తున్నారు.





