Nitish Kumar Takes Oath: బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పట్నా గాంధీ మైదానంలో గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ నితీశ్ తో ప్రమాణం చేయించారు. బీజేపీకి చెందిన సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి చెందిన మొత్తం 14 మంది, జేడీయూకు చెందిన 8 మంది, ఎల్‌జేపీ నుంచి ఇద్దరు, హిందూస్థాన్ అవామ్ మోర్చా, ఆర్‌ఎల్‌ఎం నుంచి ఒక్కొక్కరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
కండువా గాల్లో తిప్పుతూ మోడీ ఎంజాయ్
ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార వేడుకలో ఉత్సాహంగా గడిపారు. బీహార్ లో ఎన్డీయే విజయాన్ని ఆస్వాదిస్తూ.. మెడలోని కండువా తీసి తలపై గుండ్రంగా తిప్పుతూ జనాన్ని ఉర్రూతలూగించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రధాని ఉత్సాహంగా కనిపించారు. వేదిక వద్దకు చేరుకునే సందర్భంలో కూడా ప్రధాని తన కండువా గాల్లో ఊపుతూ అక్కడికి చేరుకున్న ప్రజల్ని ఉత్సాహపరిచే యత్నం చేశారు.
ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని మోడీ
భారీ జనసందోహం సాక్షిగా సాగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ప్రధాని మోడీ వేదికపై నుంచి తన కండువాను ఊపుతూ అభిమానులను ఉత్సాహపరిచారు.
బీహార్ లో ఎక్కువ కాలం సీఎంగా చేసిన వ్యక్తిగా రికార్డు!
బీహార్‌లో ఎక్కువ కాలం సీఎంగా పని చేసిన వ్యక్తిగా నితీశ్ రికార్డు సృష్టించారు. మొత్తం 19 ఏళ్లు అధికారంలో కొనసాగారు. మరోవైపు కొత్తగా కొలువుతీరిన ప్రభుత్వానికి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అభినందనలు తెలిపారు. అటు బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని గాంధీ ఆశ్రమంలో ఒకరోజు మౌనవ్రతం చేపట్టారు.





