Bihar New Govt: జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఎన్డీయే నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన బీహర్ ముఖ్యమంత్రిగా 10వ సారి ప్రమాణస్వీకారానికి మార్గం సుగమమైంది. పాట్నాలోని గాంధీ మైదానంలో ఇవాళ మధ్యాహ్నం 11.30 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఎన్డీయే నేతగా ఏకగ్రీవ ఎన్నిక
తాజాగా ఎన్డీయేకు చెందిన 202 మంది ఎమ్మెల్యేలు పాట్నాలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నితీశ్‌ను ఎన్డీయే నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దిలీప్ జైశ్వాల్, సామ్రాట్ చౌదరి, చిరాగ్ పాశ్వాన్, కేశవ్ ప్రసాద్ మౌర్య, విజయ్ కుమార్ సిన్హా, రాజు తివారి ఈ సమావేశంలో పాల్గొన్నారు. నితీశ్ కుమార్ పేరును సామ్రాట్ చౌదరి ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలంతా బలపరిచారు.
గవర్నర్‌తో నితీశ్ సమావేశం
ఎన్డీయే నేతగా నితీశ్ కుమార్ ఎన్నికకావడంతో ఆయన గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను కలిశారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మద్దతు లేఖను గవర్నర్‌కు సమర్పించారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు.
బీజేపీ నుంచే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు
నితీష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో.. తాజా మంత్రివర్గంలో బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ఉప ముఖ్యమంత్రి పదవులు చేపట్టనున్నారు. ఈ మేరకు బీజేపీ ఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఊహించని విజయం సాధించిన ఎన్డీయే
ఇక రీసెంట్ గా వెలువడిని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే అఖండ విజయాన్ని సాధించింది. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉండగా, ఎన్డీయే కూటమి ఏకంగా 202 స్థానాలను దక్కించుకుంది. ఎన్డీయే ప్రధాన భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ 89 సీట్లు గెలుచుకుని బీహార్‌లో ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో 85 సీట్లతో ఆర్జేడీ నిలిచింది. ఎన్డీయే కూటమిలోని ఎల్‌జేపీఆర్‌వీ 19 సీట్లు, హెచ్ఏఎం 5, ఆర్ఎల్ఎం 4 సీట్లు గెలుచుకున్నాయి.





