
CM Nitish Kumar: బీహార్ లో ఎన్నికల వేడి రాజుకుంది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీలో ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక ప్రకటనలు చేస్తున్నారు. ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే మహిళలకు రిజర్వేషన్లు, ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసిన ఆయన.. మరో అదిరిపోయే హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా గృహాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు.
125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
బీహార్ లో 125 యూనిట్ల వరకు గృహాలకు ఉచితంగా విద్యుత్ అందజేయనున్నట్లు నితీష్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. “మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందుబాటు ధరల్లో విద్యుత్ అందిస్తున్నాం. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నాం. గృహాలకు 125 యూనిట్ల వరకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం ఆగష్టు 1 నుంచి అమలు అవుతుంది. జూలై బిల్లు కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1.67 కోట్ల కుటుంబాలకు లాభం కలగనుంది” అని నితీష్ కుమార్ తెలిపారు.
10 వేల మెగావాట్ల సోలార్ ఉత్పత్తి లక్ష్యంగా..
అటు రానున్న మూడు ఏళ్లలో గృహ వినియోగదారుల సపోర్టుతో ప్రతి ఇంటి మీద సోలార్ పవర్ ప్లాంట్లను అమర్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. కుటీర్ జ్యోతి పథకం కింద పేద కుటుంబాలకు సోలార్ ప్లాంట్లకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మిగతా వారికి అందుబాటు ధరల్లో వీటిని అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నితీష్ కుమార్ వెల్లడించారు.
మహిళలకు 35 శాతం రిజర్వేషన్.. 5 ఏళ్లలో కోటి ఉద్యోగాలు
అటు తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని నితీష్ హామీ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పారు. బీహార్‌లో ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది.
Read Also: అన్నదాతలకు గుడ్ న్యూస్, పీఎం కిసాన్ నిధుల విడుదల ఎప్పుడంటే?