
Nitin Gadkari: కొన్ని ప్రపంచ దేశాలు ఇతర దేశాలపై దాదాగిరి చేయడానికి ప్రయత్నిస్తున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విమర్శించారు. ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాల కారణంగా ఆ దేశాలు అలా ప్రవర్తిస్తున్నాయన్నారు. భారత్‌పై అమెరికా భారీ సుంకాలు విధించిన నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాగ్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎగుమతులను పెంచి, దిగుమతలును తగ్గించుకోవాలి!
భారత కంపెనీలు ఎగుమతులను పెంచి దిగుమతులను తగ్గించుకోవాలని గడ్కరీ పిలుపునిచ్చారు. శాస్త్ర సాంకేతిక రంగాలను వినియోగించుకుని స్వావలంబన సాధించాలన్నారు. “ఆర్థికంగా బలంగా ఉన్నందుకే వారు దాదాగిరికి దిగుతున్నారు. వారి దగ్గర టెక్నాలజీ కూడా ఉంది. మనకు అత్యాధునిక టెక్నాలజీ ఉన్నా, ఎవరినీ బెదిరించము. మన సంస్కృతే ఇందుకు కారణం. సమాజ సంక్షేమమే ముఖ్యమని భారతీయ సంస్కృతి బోధిస్తోంది” అని గడ్కరీ వివరించారు.
అమెరికా తీరుపై మోడీ, రాజ్ నాథ్ విమర్శలు
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా తీరును పరోక్షంగా తప్పుబట్టారు. రైతులు, మత్స్యకారులు, పాడి పరిశ్రమ సంక్షేమం విషయంలో భారత్ ఎన్నటికీ రాజీపడదని అన్నారు. ఇందుకోసం వ్యక్తిగతంగా తాను ఎంత మూల్యం చెల్లించుకునేందుకైనా సిద్ధమేనని అన్నారు. రైతుల ప్రయోజనాలే తనకు తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. అమెరికా చర్యలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా తీవ్రంగా విమర్శించారు. భారత ఉత్పత్తుల ధరలు మరింత పెరిగేలా కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జనాలు భారతీయ వస్తువుల కొనకుండా ఉండాలనేదే వారి ఉద్దేశమని చెప్పారు. భారత్ ప్రపంచస్థాయి శక్తిగా మారకుండా ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఇక భారత్‌పై తొలుత 25 శాతం సుంకం విధించిన ట్రంప్ ఆ తరువాత 50 శాతానికి పెంచారు. కొత్త సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తుందనే కారణంతో ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలు విధిస్తున్నారు.
Read Also: ట్రంప్ చర్యలతో ఆర్థిక విధ్వంసం, అమెరికన్ ఆర్థికవేత్తల ఆగ్రహం !