జాతీయం

Himalayas: హిమాలయాల్లో అణు ముప్పు.. బీజేపీ ఆరోపణల వెనుక నిజమెంత?

మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరపై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. చైనాపై గూఢచర్యానికి అణుశక్తితో పనిచేసే నిఘా పరికరాన్ని హిమాలయాల్లో పెట్టేందుకు అమెరికాకు అనుమతించారని చెప్పుకొచ్చింది. దాని కారణంగానే..

CIA Nuclear Surveillance Mission: మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరపై బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే షాకింగ్ కామెంట్స్ చేశారు. చైనాపై గూఢచర్యానికి అణుశక్తితో పనిచేసే నిఘా పరికరాన్ని మన హిమాలయాల్లో ఏర్పాటు చేసేందుకు అమెరికా గూఢచార సంస్థ సీఐఏకి  అనుమతి ఇచ్చారని వెల్లడించారు. గంగానది ఒడ్డున నివశిస్తున్నవారిలో ఇటీవలి కాలంలో క్యాన్సర్‌ కేసులు పెరగడానికి, హిమాలయ ప్రాంతాల్లో విపత్తులు సంభవించడానికి కారణం ఇదేనన్నారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.

నెహ్రూ, ఇందిరపై తీవ్ర ఆరోపణలు

గతంలోనూ నిశికాంత్ ఇద్దరు మాజీ ప్రధానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘భారత తొలి ప్రధాని నెహ్రూ 1964లో, ఆ తర్వాత.. 1967, 1969 సంవత్సరాల్లో ఇందిర సీఐఏతో కుమ్మక్కై.. చైనాపై గూఢచర్యానికిగాను హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అణు పరికరాలను ఏర్పాటు చేయడానికి సహకరించారు. ఆ తర్వాత అమెరికన్లు ఆ పరికరాలను అక్కడే వదిలి వెళ్లిపోయారు’’ అని ఆయన తెలిపారు. 1978లో అప్పటి అమెరికా చట్టసభల సభ్యులు అప్పటి దేశాధ్యక్షుడికి రాసిన ఒక లేఖ ప్రతిని కూడా ఆయన తన పోస్టుకు జత చేశారు. అప్పట్లో హిమాలయాల్లో అమర్చిన  ప్లుటోనియంతో పనిచేసే నిఘా పరికరం’ ఎక్కడుందో కనిపించకుండా పోయిందని.. దాని నుంచి అణుధార్మిక లీకేజీ జరిగే ప్రమాదం ఉందని వారు ఆ లేఖలో ఆందోళన వ్యక్తంచేశారు. డిసెంబరు 13న న్యూయార్క్‌ టైమ్స్‌ దీనిపై ఒక కథనాన్ని ప్రచురించిందన్నారు.

అసలు ఏం జరిగిందంటే?

ఆరు దశాబ్దాల క్రితం చైనా ఒక అణుబాంబు పరీక్ష నిర్వహించింది. దీంతో అప్రమత్తమైన సీఐఏ.. చైనా క్షిపణి పరీక్షలపై నిఘా కోసం హిమాలయ పర్వత శిఖరాల్లో ఒకటైన నందాదేవిపై ప్లుటోనియంతో పనిచేసే పరికరాన్ని అమర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా, భారత్‌కు చెందిన పర్వతారోహకులు ఒక పెద్ద యాంటెన్నా, కేబుళ్లు, ‘శ్నాప్‌ 19-సి’గా పిలిచే 13 కిలోల జనరేటర్‌ను నందాదేవి శిఖరంపైకి మోసుకెళ్లారు. అక్కడ అమర్చే సమయంలో మంచుతుఫాను వచ్చింది.  పైనున్నవారు తమ శిబిరానికి దగ్గర్లో ఆ పరికరాలను దాచి, కిందికి వచ్చేశారు. వారు పైన దాచినవాటిలో ఒక అణు పరికరం ఉంది. ఏడాది తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లి వెతికితే ఏమీ దొరకలేదు. కనిపించకుండాపోయిన పరికరాల్లో ప్లుటోనియం క్యాప్సూల్స్‌ ఉండడంతో.. రేడియేషన్‌ డిటెక్టర్లతో, ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సర్లతో వాటిని గుర్తించేందుకు ప్రయత్నించారుగానీ.. ఉపయోగం లేకపోయింది. ఇప్పుడా పరికరాలు ఎక్కడ ఉన్నాయో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. ఇదే విషయాన్ని నిశికాంత్ పదే పదే ప్రస్తావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button