
పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న ఓ విచిత్రమైన, కలిచివేసే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. భర్త తన భార్య నల్లగా ఉందన్న కారణంతో ఆమెను పుట్టింట్లో వదిలేయడం, ఆపై అత్తమామల వేధింపులు భరించలేక ఆమె నేరుగా అత్తగారింటి ముందు ఆందోళనకు దిగడం కలకలం రేపింది. వినుకొండ పట్టణ పరిధిలో జరిగిన ఈ ఘటన మహిళలపై కొనసాగుతున్న వివక్షకు మరో నిదర్శనంగా మారింది. బాధితురాలి వేదన విన్న స్థానికులు సైతం షాక్‌కు గురవుతున్నారు.
వినుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన గోపి లక్ష్మికి, అదే మండలానికి చెందిన కోటేశ్వరరావుతో ఈ ఏడాది జూన్‌లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో తన తల్లిదండ్రులు 2 ఎకరాల పొలం అమ్మి, రూ.20 లక్షల నగదు, 20 సవర్ల బంగారాన్ని కట్నంగా ఇచ్చినట్లు లక్ష్మి కన్నీళ్లతో వెల్లడించింది. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమెకు.. పెళ్లైన రెండు నెలలకే కష్టాలు మొదలయ్యాయని చెబుతోంది. భర్తతో పాటు అత్త శేషమ్మ, మామ వెంకటేశ్వర్లు కలిసి తనను మానసికంగా, శారీరకంగా వేధించారని ఆమె ఆరోపిస్తోంది.
తాను నల్లగా ఉన్నానన్న కారణంతో భర్త నిరంతరం అవమానించేవాడని, తన వల్ల ఇంట్లో అశుభాలు జరుగుతున్నాయని అత్తమామలు దూషించేవారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తూ, తిండి కూడా పెట్టకుండా కొట్టారని తెలిపింది. చివరకు భరించలేక తనను పుట్టింటికి పంపించేశారని చెప్పింది. అయినా సమస్య పరిష్కారం కావాలని తల్లిదండ్రులతో కలిసి అత్తగారింటికి వెళ్లగా, తమపై దాడికి ప్రయత్నించి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని వాపోయింది.
ఈ పరిస్థితుల్లో తనకు న్యాయం చేయాలని కోరుతూ గోపి లక్ష్మి అత్తమామల ఇంటి ముందు బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోనని స్పష్టం చేసింది. తన జీవితాన్ని నాశనం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులను వేడుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మహిళపై వివక్ష, కట్నం వేధింపులు ఇంకా కొనసాగుతున్నాయనే చేదు నిజాన్ని మరోసారి బయటపెట్టింది. ఈ కేసుపై పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.





