
New Year’s Thoughts: మంచో చెడో, సుఖమో దుఃఖమో, ఆనందమో ఆవేదనో.. ఏది ఎదురైనా చూస్తుండగానే మరో ఏడాది ముగింపు దశకు చేరుకుంది. ఇంకొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం మొదలవబోతోంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరి మనసులో గత ఏడాది అనుభవాల జ్ఞాపకాలు అలజడి సృష్టిస్తున్నాయి. మధుర క్షణాలు మనసును తాకుతుంటే, చేదు అనుభవాలు గుండెను బరువెక్కిస్తున్నాయి. అయితే జరిగినదేదో జరిగిపోయింది. అది మంచైనా చెడైనా ఇప్పుడు మారదు. కాబట్టి గతాన్ని మోస్తూ కూర్చోకుండా, వర్తమానంలో నిలబడి భవిష్యత్తు వైపు ముందడుగు వేయాల్సిన సమయం ఇదే అని నిపుణులు చెబుతున్నారు.
కొత్త ఏడాది అంటే కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు. ముఖ్యంగా యువతలో వచ్చే ఏడాది ఎలా ఉండాలనే ఆలోచన బలంగా కనిపిస్తోంది. కేవలం యువత మాత్రమే కాదు… పిల్లలు, పెద్దలు, ఉద్యోగులు, వ్యాపారులు… అందరి ఫైనల్ డెసిషన్ ఒక్కటే. వచ్చే ఏడాది అయినా హ్యాపీగా ఉండాలి. అయితే ఈ కోరిక ఒక్కటే ఉంటే సరిపోదు. సంతోషం అనేది బయట నుంచి వచ్చే బహుమతి కాదు. మనమే సృష్టించుకోవాల్సిన భావన అని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సంతోషం అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండడమే కాదు. జీవితంలో బాధ, నష్టం, నిరాశ లేవనుకుంటే అది వాస్తవానికి దూరం. నిపుణుల మాటల్లో చెప్పాలంటే హ్యాపీనెస్ అనేది ఒక న్యూట్రల్ ఎక్స్‌పీరియన్స్. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా వాటిని మనం ఎలా స్వీకరిస్తామన్నదే సంతోషానికి మూలం. చాలామంది సంతోషం అంటే ఆస్తులు, అంతస్తులు, హోదా, విలాసాలు అని భావిస్తారు. కానీ ఇవన్నీ ఉన్నా కొందరు అసంతృప్తిగా జీవిస్తుంటారు. అదే సమయంలో ఏమీ లేని కొందరు చిరునవ్వుతో జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. అసలైన సంతోషం మనలోనే ఉందని ఇది స్పష్టం చేస్తోంది.
సంతోషాన్ని బయట వెతికితే అది దొరకదు. విజయం వస్తే సంతోషిస్తాం, ఓటమి వస్తే కుంగిపోతాం అనే ఆలోచన మనల్ని మరింత అస్థిరంగా మారుస్తుంది. గెలుపు క్షణిక ఆనందాన్ని ఇవ్వొచ్చు. ఓటమి తాత్కాలిక బాధను కలిగించొచ్చు. కానీ ఈ రెండింటికీ మన స్పందన ఎలా ఉందన్నదే కీలకం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగడం కూడా ఒక రకమైన సంతోషమే. లక్ష్యం వైపు చేసే ప్రయత్నం, పట్టుదల, కృషి ఇవన్నీ మనసులో అంతర్గత సంతృప్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
కాలం మన కోసం ఆగదు. పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. జీవితంలో ఒడిదుడుకులు సహజం. వాటిని అంగీకరించే మనస్తత్వం పెంపొందించుకుంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏమీ లేకపోయినా సంతోషంగా ఉండగలననే సంకల్పం ఉంటే నిజంగానే మనం హ్యాపీగా జీవించగలం. ఇది వినడానికి తేలికగా అనిపించినా, ఆచరణలో పెట్టడం కాస్త కష్టమే. అయినా ఇదే నిజమైన జీవన సూత్రం.
నిజమైన సంతోషం అంటే ప్రశాంతమైన మనసు. కొందరు తక్కువ వనరులతోనే జీవిస్తూ ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తుంటారు. అలాంటి వారు ఓటమికి భయపడరు. సమస్యలను కూడా సవాళ్లుగా స్వీకరిస్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే. సంతోషం అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. దానిని ఎవరు మనకు ఇవ్వలేరు. ఎవరు మన నుంచి లాక్కోలేరు కూడా.
కోపం, అసూయ, పగ, ప్రతీకారం, ఓవర్ థింకింగ్ వంటి భావాలు మనసును మెల్లగా నాశనం చేస్తాయి. ఇవి శారీరక ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇతరులు ఏమనుకుంటున్నారో అన్న ఆలోచనల్లోనే జీవితం వృథా చేసుకుంటే మన సంతోషాన్ని మనమే కోల్పోతాం. కాబట్టి సంతోషంగా ఉండాలంటే ముందుగా ఈ నెగటివ్ భావాలను వదిలేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిజాయితీగా జీవించడం, క్రమశిక్షణ పాటించడం, మంచి వైపు అడుగులు వేయడం… ఇవన్నీ మనసుకు శాంతిని ఇస్తాయి. ప్రస్తుతం ఉన్న క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటేనే జీవితంలో నిజమైన ఆనందాన్ని అనుభవించగలం. సంతోషం అనేది మార్కెట్‌లో దొరికే వస్తువు కాదు. ఎవరో ఇచ్చే బహుమతి కాదు. మనం అనుభూతి చెందే విధానమే అది. మన ఆలోచనలే మన జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి.
కొత్త సంవత్సరంలో నిజంగా హ్యాపీగా ఉండాలనుకుంటే ఏం చేయాలనే ప్రశ్నతో తలపట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న జీవితాన్ని అంగీకరించండి. మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. ప్రతీ క్షణాన్ని మీకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు తల్చుకుంటే ప్రతీ రోజు, ప్రతీ క్షణం సంతోషంగా మారుతుంది. అదే కొత్త సంవత్సరానికి తీసుకోవాల్సిన అసలైన నిర్ణయం అని నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: AI: పవర్ బ్యాంక్ సైజులో సూపర్ కంప్యూటర్





