కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను నియమాలు అమల్లోకి రావడంతో పన్ను వ్యవస్థలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మార్పులు కేవలం పన్ను చెల్లింపుదారులకే కాకుండా దేశ ప్రజలందరిపై కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉంది. పన్ను చెల్లింపులను మరింత సులభతరం చేయడం, పారదర్శకతను పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ఈ మార్పులను ప్రకటించింది. కొత్త నియమాలలో ముఖ్యంగా ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు, పన్ను రిటర్న్స్ దాఖలు గడువుల్లో సవరణలు, టీసీఎస్ రేట్ల మార్పులు, స్టాక్ మార్కెట్ లావాదేవీలపై పన్ను పెంపు వంటి అంశాలు ఉన్నాయి.
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో ఈ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానం ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు ప్రక్రియను మరింత సరళతరం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా పేపర్‌లెస్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటు సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా భాషను ఉపయోగించేలా మార్పులు చేయనున్నారు. దీంతో పన్ను చెల్లింపుదారులు రిటర్న్స్ దాఖలు చేయడంలో ఎదుర్కొనే ఇబ్బందులు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.
ఇక ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువుల్లో కూడా కొన్ని మార్పులు చేశారు. ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్-3, ఐటీఆర్-4 దాఖలు చేయడానికి గడువు తేదీని ఆగస్టు 31 వరకు పొడిగించారు. ఈ సవరించిన గడువు 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా వర్తించనుంది. అయితే ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫార్ములు దాఖలు చేసే వారికి మాత్రం జూలై 31 వరకు గడువు కొనసాగనుంది. ఈ మార్పులతో పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం లభించనుందని ప్రభుత్వం భావిస్తోంది.
పన్ను వ్యవస్థలో గందరగోళం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం టీసీఎస్ రేట్లలో కూడా మార్పులు చేసింది. కొన్ని రంగాల్లో ఈ రేట్లను పెంచగా, మరికొన్ని రంగాల్లో తగ్గించారు. ఆల్కహాలిక్ పానీయాలపై టీసీఎస్ రేటును 1 శాతం నుంచి 2 శాతానికి పెంచారు. స్క్రాప్ అమ్మకాలపై టీసీఎస్ రేటును కూడా 1 శాతం నుంచి 2 శాతానికి పెంచారు. అలాగే ఖనిజాల అమ్మకాలపై కూడా 1 శాతం నుంచి 2 శాతానికి పెంపు చేశారు. మరోవైపు టెండు ఆకుల అమ్మకాలపై టీసీఎస్ రేటును 5 శాతం నుంచి తగ్గించారు. విదేశీ టూర్ ప్యాకేజీలపై ఉన్న రేటును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. విద్య, వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లే సందర్భాల్లో వర్తించే టీసీఎస్ రేటును కూడా 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇక స్టాక్ మార్కెట్లో లావాదేవీలు చేసే పెట్టుబడిదారులపై కూడా ప్రభావం చూపేలా సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ను పెంచారు. ముఖ్యంగా ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వారికి ఈ మార్పు వర్తించనుంది. ఫ్యూచర్స్ లావాదేవీలపై వర్తించే ఎస్టిటి రేటును పెంచారు. అలాగే ఆప్షన్ లావాదేవీలపై కూడా పన్ను రేటును పెంచారు. ఈ మార్పులతో స్టాక్ మార్కెట్ ట్రేడర్లపై అదనపు భారం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
డివిడెండ్ ఆదాయంపై కూడా కీలక మార్పులు చేశారు. ఏప్రిల్ 2026 నుంచి డివిడెండ్ ద్వారా వచ్చే ఆదాయంపై వడ్డీ ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉండదు. ఇప్పటి వరకు డివిడెండ్ ఆదాయం సంపాదించడానికి తీసుకున్న రుణాలపై వచ్చే వడ్డీ ఖర్చుల్లో కొంత భాగాన్ని తగ్గించుకునే అవకాశం ఉండేది. కానీ కొత్త నియమాల ప్రకారం ఆ సౌకర్యాన్ని తొలగించారు. దీంతో డివిడెండ్ ఆదాయం పూర్తిగా వర్తించే పన్ను స్లాబ్ ప్రకారం పన్నుకు లోబడి ఉంటుంది. గతంలో ఉన్న 20 శాతం వరకు వడ్డీ తగ్గింపు పరిమితిని కూడా తొలగించారు.
ALSO READ: డ్రోన్‌తో సూపర్ సాగు.. నువ్వుల పంట సాగులో కొత్త ప్రయోగం
