కొనసాగుతున్న పనులు
ఏడాదిలోగా అందుబాటులోకి
వరంగల్, క్రైమ్ మిర్రర్: వరంగల్ నగర ప్రజలకు గుడ్‌న్యూస్. త్వరలోనే మామునూరు ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రానుంది. ఇది ఏర్పాటు కావడంతో వరంగల్‌కు కొత్త శోభ సంతరించుకోనుంది. ఎయిర్ కనెక్టివిటీ కోసం హైదరాబాద్ రావాల్సిన పని లేకుండా నగరం నుంచే రాకపోకలు సాగించొచ్చు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు డీపీఆర్ సిద్ధం కాగా.. త్వరలోనే కేంద్రం ఆమోదముద్ర వేయనుంది.
ఆ తర్వాత ఏడాదిలోగా ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తు్న్నారు.తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఒక్కటే పౌరులకు సేవలందిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచాలనే లక్ష్యంతో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టులు ప్రతిపాదించారు.
వరంగల్ మామునూరు, రామగుండం, పెద్దపల్లి, కొత్తగూడెంలలో కొత్తగా ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఇందులో వరంగల్ మామునూరు విమానాశ్రయం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టు పనులు జరుగుతున్నాయి.ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టు డీపీఆర్ సిద్ధంగా కాగా అది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
పెద్ద విమానాల మార్గాలు నిర్మాణం…
ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి పెద్ద పెద్ద విమానాలు ఈజీగా ల్యాండ్ అయ్యేలా రన్‌వేను మూడు కి.మీ.మేర పొడిగిస్తారు. ప్రయాణికుల టెర్మినల్, కార్గో సౌకర్యం, సెక్యూరిటీ వ్యవస్థలు, పార్కింగ్, అనుసంధాన మార్గాలు వంటివి ఎయిర్‌పోర్టులో నిర్మిస్తారు.
ఎయిర్పోర్ట్ అభివృద్ధికి అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. సుమారు 950 ఎకరాల భూమిని ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం కేటాయించారు. ఈ భూమికి అదనంగా మరో 253 ఎకరాలు సేకరించి ఎయిర్‌పోర్టు అథారిటీకి అప్పగించారు.మామునూరు ఎయిర్పోర్ట్ ప్రస్తుతం చిన్న ఎయిర్‌స్ట్రిప్‌గా ఉంది.
అందుబాటులోకి వస్తే అభివృద్దిలో దూసుకపోతుంది…
దీన్ని పూర్తిస్థాయి కమర్షియల్ ఎయిర్‌పోర్ట్‌గా మార్చడంతో వరంగల్ ప్రాంతం అభివృద్ధిలో దూసుకెళ్లనుందని నిపుణులు చెబుతున్నారు. ఎయిర్ కనెక్టివిటీ కోసం హైదరాబాద్ నగరం వెళ్లాల్సిన లేకుండా ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరుకోవచ్చునని అంటున్నారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వరంగల్ నగరానికి క్యూ కడతాయని చెబుతున్నారు.
టూరిజం పెరుగుతుందని.. రామప్ప ఆలయం, వేయిస్తంభాల గుడి, వరంగల్ కోట వంటి ప్రదేశాలు సందర్శించే విదేశీ పర్యాటకులు పెరుగుతారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మొదట చిన్న, మధ్యస్థాయి విమానాలతో రాకపోకలు ప్రారంభిస్తారని.. ఆ తర్వాత రోజుకు 1-2 విమానాలు రాకపోకలు సాగిస్తాయని అంటున్నారు. ప్రధానం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాలకు కనెక్టివిటీ పెరుగుతుందని చెబుతున్నారు
