అంతర్జాతీయం

చైనా పర్యటనకు ప్రధాని మోడీ, జిన్ పింగ్ తో భేటీ ఆ రోజే!

PM Modi China Visit: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆగష్టు 31 నుంచి సెప్టెంబర్‌ 1 వరకూ.. రెండు రోజుల పాటూ చైనాలో ప్రధాని పర్యటించనున్నారు.  టియాంజిన్‌ లో జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలోపాల్గొననున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆగస్టు 31న చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ తో మోడీ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు. ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలతో పాటు సరిహద్దు సమస్యలపైనా చర్చించనున్నారు.

ఏడేళ్ల తర్వాత మోడీ చైనా పర్యటన

ప్రధాని మోడీ ఏడేళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్నారు. చివరిసారిగా 2018లో పర్యటించారు. అనంతరం చైనా అధ్యక్షుడు 2019లో భారత్‌ లో పర్యటించారు. ఆ తర్వాత 2020లో లద్దాఖ్‌ సరిహద్దుల్లో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత గత అక్టోబర్‌ లో జరిగిన బ్రిక్స్‌ సదస్సులో ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తో సమావేశమయ్యారు.  ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ జరిగింది. నేరుగా విమాన సర్వీసులు, కైలాస్‌ మానసరోవర్‌ యాత్రను పునరుద్ధరించేందుకు ఈ సంవత్సరం జూన్‌ లో ఇరు దేశాలు అంగీకరించాయి.

మోడీ చైనా పర్యటనపై ఆసక్తి

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అదనపు సుంకాల వేళ మోడీ చైనా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సహా మధ్య, పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలకు చెందిన దాదాపు 20 మందికిపైగా ప్రపంచ నాయకులకు షాంఘై సహకార సమావేశంలో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. సదస్సు సందర్భంగా మోడీతోపాటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ను చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ స్వయంగా ఆహ్వానించనున్నారు. చైనా పర్యటనకు ముందు ప్రధాని మోడీ జపాన్‌ వెళ్లనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button