
Nalgonda SP Focus On Road Accidents: నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కీలక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ శరత్ చంద్ర ప్రవార్ తెలిపారు. తరచుగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి.. నివారణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. తాజాగా నార్కెట్ పల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా షాపు యజమానాలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు పై వాహనాలు పార్కింగ్ చేస్తే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
58 నుంచి 33కి తగ్గిన బ్లాక్ స్పాట్స్
ఇక నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఎస్పీ పవార్ తెలిపారు. “నల్లగొండ జిల్లా పరిధిలో 270 కిలో మీటర్ల జాతీయ రహదారులు, 209 కిలో మీటర్ల స్టేట్ హైవేలు ఉన్నాయి. ప్రమాదాల జరిగే చోటును బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి అక్కడ ప్రమాదాల నివారణ కోసం కాషన్ లైట్స్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. గత సంవత్సరం జిల్లాలో 58 బ్లాక్ స్పాట్స్ ఉంటే ఈ సంవత్సరం అవి 33కు తగ్గాయి. జిల్లా పోలీస్ శాఖ తరపున ప్రమాదాల నివారణ కోసం ప్రయాణీకులకు అవగాహన కర్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతి ఏటా వాహనాల సంఖ్య పెరుగుతున్నందున, ఎప్పటికప్పుడు నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈసారి చాలా వరకు సక్సెస్ అయ్యాం కూడా. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రమాదాల నివారణపై రోడ్ సేఫ్టీ కార్యక్రమాలను అన్ని శాఖల అధికారులతో కలిసి నిర్వహిస్తున్నాం. నిత్యం ప్రమాదాలు జరిగే చోట సైన్ బోర్డ్స్, లైట్స్, పొలాడ్స్ ఏర్పాటు చేస్తున్నాం. బ్లాక్ స్పాట్స్ దగ్గర చిన్న చిన్న మెయింటెనెన్స్ కోసం నేషనల్ హైవే అధికారుల సహకారం తీసుకుంటూ ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నాం. జాతీయ రహదారి 65 విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారం కాకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంకో సంవత్సరంలో శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటాం” అన్నారు.
Read Also: అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరికలు!