-
బిఆర్ఎస్ హయాంలోనే ఈ భూముల వ్యవహారం శ్రీకారం
-
ఇప్పుడు కేవలం కొనసాగింపు మాత్రమే
-
అడ్డగోలుగా ఆరోపణలు చేసి అడ్డంగా బుక్కైన గులాబీ పార్టీ నేతలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం పై గట్టిగానే పోరాటం చేస్తోంది బిఆర్ఎస్. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ అవినీతి జరిగింది అంటూ బిఆర్ఎస్ అగ్రనేతలు విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఆరోపణలకు సంబంధించిన మూలాలు వెతికితే మాత్రం అవి బిఆర్ఎస్ హయాంలో జరిగినవి అని వెలుగు చూస్తుండడం గులాబీ పార్టీ మెడకు చుట్టుకుంటుంది. ప్రభుత్వంపై బురదజల్లే క్రమంలో ఆయా నిర్ణయాలు, ఒప్పందాలు తమ హయాంలోనే జరిగాయన్న విషయాన్ని విస్మరిస్తుండడంతో ప్రధాన ప్రతిపక్షం ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. ఇందుకు చక్కటి ఉదాహరణ నాదర్ గుల్ భూములు.
వివరాలు బయటపడిన వైనం..
నాదర్ గుల్ భూముల విషయంలో భారీ కుంభకోణం జరిగిందని బిఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ ప్రభుత్వ వర్గాలు పాత రికార్డులను బయటపెట్టాయి. సదరు భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియ, దానికి సంబంధించిన ఫైళ్ళ కదలిక అంతా బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే పూర్తయ్యాయని తేలింది. ప్రస్తుతం జరిగినది కేవలం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన కొనసాగింపు చర్యలే. దీంతో ఇప్పుడు గులాబీ పార్టీ ఆరోపణలు గాలిలో కలిసిపోయాయి. చివరకు ఈ అంశంపై నోరు మెదపలేని పరిస్థితి ఆ పార్టీది.
కొత్త తలనొప్పులు..
ప్రధానంగా గులాబీ పార్టీ హ్యమ్ రోడ్ల నిర్మాణం, హిల్డ్ పాలసీ వ్యవహారాలు కూడా ఇప్పుడు ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం హ్యామ్ పద్ధతిలో చేపట్టిన టెండర్లలో అవినీతి జరిగిందని ప్రతిపక్షం గగ్గోలు పెడుతోంది. అయితే అసలు ఈ విధానానికి శ్రీకారం చుట్టింది.. పైలెట్ ప్రాజెక్టుల పేరుతో టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లింది గులాబీ ప్రభుత్వమేనని అధికారికార్డులు చెబుతున్నాయి. కెసిఆర్ హయాంలోనే హిల్డ్ పాలసీకి సంబంధించిన ముసాయిదాలు కూడా తయారయ్యాయి. పాము అధికారంలో ఉన్నప్పుడు రూపొందించిన విధివిధానాలే ఇప్పుడు కాంగ్రెస్ అమలు చేస్తుంటే.. వాటిని అవినీతిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు.
ప్రభుత్వం రివర్స్ కౌంటర్..
ప్రస్తుతం నాదర్ గుల్ భూముల వ్యవహారంలో తాము చేసిన ఆరోపణలు తిరిగి తమ మెడకే చుట్టుకుంటుండడంతో గులాబీ పార్టీ శ్రేణులు డిఫెన్స్ లో పడిపోతున్నాయి. సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేసిన అంశాలపై ప్రభుత్వం ఆధారాలతో సహా కౌంటర్ ఇస్తోంది. దీంతో గులాబీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ మౌనం పాటించాల్సి వస్తోంది. రాజకీయాల్లో అధికార పక్షాన్ని విమర్శించడం ప్రతిపక్ష బాధ్యత. కానీ వాటికి ఆధారాలు ఉండాలి. హేతుబద్ధత ఉండాలి. తమ హయాంలో జరిగిన లోపాలను కూడా ఇప్పుడు జరిగినట్లుగా ప్రచారం చేయడం వల్ల గులాబీ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అవుతుంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో బిఆర్ఎస్ చేసే నిజమైన విమర్శలను కూడా ప్రజలు నమ్మేస్థితి ఉండదు. ఇది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే మంచిది.
