
నవవధువు ఆత్మహత్య కేసు బెంగళూరులో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గానవి (26) గురువారం రాత్రి మృతి చెందింది. 3 రోజులుగా ఐసీయూలో ప్రాణాలతో పోరాడిన ఆమె.. చివరకు బ్రెయిన్‌డెడ్ స్థితిలోనే కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన కొత్తగా పెళ్లైన జంటల జీవితాల్లోని ఒత్తిళ్లు, గృహహింస అంశాలపై మరోసారి చర్చకు దారి తీసింది.
పోలీసుల కథనం ప్రకారం.. గానవి-సూరజ్‌ల వివాహం అక్టోబర్ చివరిలో ఘనంగా జరిగింది. ఇద్దరూ బెంగళూరుకు చెందిన వారే. పెళ్లైన కొద్ది రోజుల్లోనే దంపతుల మధ్య విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. వివాహానంతరం హనీమూన్ కోసం శ్రీలంకకు వెళ్లిన సమయంలో అక్కడ గొడవ జరగడంతో మధ్యలోనే తిరిగి బెంగళూరుకు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పటి నుంచే గానవి మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైందని బంధువులు ఆరోపిస్తున్నారు.
మూడురోజుల క్రితం భర్త ఇంట్లోనే గానవి ఉరివేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. అయితే అప్పటికే ఆమె మెదడుకు తీవ్ర నష్టం జరిగిందని, బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరిందని డాక్టర్లు తెలిపారు. చివరకు గురువారం రాత్రి ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఈ ఘటనపై గానవి పెద్దమ్మ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. గానని భర్త సంసారానికి పనికిరాడని, తొలి రాత్రినే తనకు ఫోన్ చేసి గానవి బాధపడిందని ఆమె వెల్లడించారు. భర్త నపుంసకుడని, తన జీవితంపై భయం వ్యక్తం చేస్తూ గానవి తన మనసు వెల్లబోసుకుందని చెప్పారు. అంతేకాదు, పెద్ద మొత్తంలో బంగారం, స్థలం, కారు, ప్రతి నెలా ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని భర్త తరచూ వేధించేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
గానవి మృతితో ఈ కేసు మరింత కీలకంగా మారింది. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు రామమూర్తినగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివాహానంతరం జరిగిన సంఘటనలు, హనీమూన్ సమయంలో తలెత్తిన విభేదాలు, భర్తపై ఉన్న ఆరోపణలన్నింటినీ పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నవవధువు మృతికి గల నిజమైన కారణాలు వెలుగులోకి తీసుకొస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ALSO READ: Nidhi Agarwal: దాని గురించి బయటికి చెప్పను





