జాతీయం

టారిఫ్‌ టారిఫ్ లు.. బాధిత కంపెనీలకు కేంద్రం స్పెషల్ ప్యాకేజీ!

Tariff Impact: అమెరికా అడ్డగోలు సుంకాలతో ఇబ్బందులు పడుతున్న భారత పరిశ్రమలు, ఎగుమతిదారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక  నిర్ణయం తీసుకుంది. ఆయా కంపెనీలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని మోడీ సర్కారు భావిస్తోంది. ఎగుమతులపై ఆధారపడిన సంస్థలకు సులువుగా రుణాలు, మూల ధనం అందేలా చూడటం, కొత్త మార్కెట్లను అన్వేషించుకునేందుకు తోడ్పడటం వంటి చర్యలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది.  కరోనా సమయంలో కుదేలైన చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.20 లక్షల కోట్లతో ఇచ్చిన రిలీఫ్‌ ప్యాకేజీ తరహాలో ఈ ప్యాకేజీ ఇవ్వనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. సుంకాల దెబ్బకు ఎగుమతులు తగ్గిన సంస్థలు మూతపడకూడదని, ఉద్యోగాలేవీ పోకుండా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించాయి.

భారత్ పై 50 శాతం టారిఫ్ విధించిన అమెరికా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పై 50శాతం సుంకాలు విధించడంతో.. మన దేశం నుంచి అమెరికాకు చేసే ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా వస్త్రాలు, పాదరక్షలు, రసాయనాలు, యంత్ర పరికరాలు, రొయ్యలు, రత్నాలు-ఆభరణాల రంగాల పరిశ్రమలకు దెబ్బతగిలింది. కాగా, క్రెమ్లిన్‌ కు భారత్‌ శుద్ధి కేంద్రంగా ఉపయోగపడుతోందంటూ ట్రంప్‌ వాణిజ్య సలహాదారు నవారో ఇటీవల చేసిన వ్యాఖ్యలను భారత్‌ తోసిపుచ్చింది. నవారో వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జైస్వాల్‌ చెప్పారు. అమెరికాతో సంబంధాలు తమకెంతో ముఖ్యమని, రెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయన్నారు.

Back to top button