
Murder: ముంబై మహానగరం సమీపంలోని బడ్లాపూర్‌లో వెలుగుచూసిన ఓ హత్య కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మూడేళ్ల క్రితం సహజ మరణంగా భావించిన ఒక ఘటన.. తాజాగా బయటపడిన దర్యాప్తు వివరాలతో పక్కా ప్రణాళికతో చేసిన దారుణ హత్యగా తేలింది. ఈ కేసులో మరింత షాకింగ్ విషయం ఏమిటంటే.. భార్యను హత్య చేయించిన వ్యక్తి ఎవరో కాదు.. ఆమె భర్తే కావడం. అంతేకాదు, హత్యకు ఉపయోగించిన పద్ధతి పోలీసులను కూడా విస్తుపోయేలా చేసింది. విష సర్పంతో కాటేయించి భార్యను హత్య చేయించడం అనేది సాధారణ నేరం కాదు, ఇది అత్యంత క్రూరమైన కుట్రగా దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు.
2022లో బడ్లాపూర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా నేత నీర్జా ఆంబేకర్ అకస్మాత్తుగా మృతి చెందారు. అప్పట్లో ఆమె మరణం పాము కాటు వల్ల జరిగిందని వైద్యులు నిర్ధారించడంతో, పోలీసులు కేవలం ఆకస్మిక మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తును ముగించారు. స్థానికంగా కూడా ఈ ఘటనపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం కాలేదు. రాజకీయంగా చురుకైన మహిళ అయినప్పటికీ, ఆమె మరణాన్ని సహజ ఘటనగానే అందరూ స్వీకరించారు. కానీ కాలం గడిచేకొద్దీ ఈ కేసు వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.
ఇటీవల బడ్లాపూర్ పరిధిలో మరో హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఋషికేష్ చాళ్కేను పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా అతడిని పాత నేరాలపై కఠినంగా ప్రశ్నించగా, అతడు అనుకోకుండా నీర్జా ఆంబేకర్ హత్యకు సంబంధించిన సంచలన విషయాలను బయటపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ సమాచారం ఆధారంగా కేసును తిరిగి తెరిచి లోతైన దర్యాప్తు ప్రారంభించారు. గత 6 నెలలుగా సాగిన విచారణలో పోలీసులకు షాక్‌కు గురిచేసే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ హత్యకు మాస్టర్‌మైండ్‌గా నీర్జా భర్త రూపేశ్ ఆంబేకర్ వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది. తన భార్యను సహజ మరణంలా చూపించి తప్పించుకోవాలనే ఉద్దేశంతో అతడు అత్యంత దారుణమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. రూపేశ్ తన ముగ్గురు సహచరులు చేతన్ దుధానే, కునాల్ చౌధరీ, ఋషికేష్ చాళ్కేతో కలిసి ఈ హత్యకు ప్లాన్ వేశాడు. ముందే ఒక విష సర్పాన్ని బస్తాలో దాచి తీసుకొచ్చి, నీర్జా ఇంటి వంటగదిలో ఉంచినట్లు విచారణలో వెల్లడైంది.
హత్య జరిగిన రోజు భార్యకు కాళ్లు మర్దన చేస్తానని చెప్పి, ఆమెను హాల్‌లో పడుకోబెట్టాడు రూపేశ్. అదే సమయంలో అతడి సహచరులు బస్తాలో ఉన్న పామును బయటకు తీసి, నీర్జా ఎడమ కాలి మడమ వద్ద మూడు సార్లు బలవంతంగా కాటు వేయించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఈ ఘటనను సహజ మరణంగా చిత్రీకరించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భర్త ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అప్పట్లో పోలీసులు కేవలం ఏడీఆర్ నమోదు చేసి కేసును మూసివేయడం జరిగింది.
అంబర్నాథ్ ఏసీపీ శైలేష్ కాలే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు. 2022లో బడ్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఆకస్మిక మరణం కేసు, ఇప్పుడు హత్య కేసుగా మారిందని ఆయన తెలిపారు. ప్రాథమికంగా పాము కాటు వల్లే మరణమని వైద్యులు నివేదిక ఇచ్చినందున దర్యాప్తు అప్పట్లో ముగిసిందని చెప్పారు. కానీ తాజాగా అందిన సమాచారం మేరకు ఇది ముందస్తు కుట్రతో చేసిన హత్య అని నిర్ధారణ కావడంతో, కేసును తిరిగి తెరిచి లోతైన దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.
ఈ దర్యాప్తులో 109 బీఎన్ఎస్ సెక్షన్ కింద ఒక నిందితుడిని అరెస్టు చేసినట్లు, విచారణలో అతడు హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించడంతో నీర్జా భర్త రూపేశ్ ప్రధాన పాత్రధారుడిగా స్పష్టమైందని ఏసీపీ తెలిపారు. ఆ ఆధారాలతో మిగిలిన నిందితులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసు బయటపడిన తర్వాత స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఒక రాజకీయ నేతను, అది కూడా ఆమె భర్తే ఇంత భయంకరంగా హత్య చేయించాడన్న విషయం ప్రజలను షాక్‌కు గురిచేస్తోంది. సహజ మరణంగా కనిపించిన ఘటన వెనుక ఇంతటి క్రూరమైన కుట్ర దాగి ఉండటం పోలీసు దర్యాప్తు ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేస్తోంది.
ALSO READ: Interesting fact: పుట్టగానే పిల్లలు ఎందుకు ఏడుస్తారు? నవ్వుతూ ఎందుకు పుట్టరు?





