
Murder: యాదాద్రి భువనగిరి జిల్లాలోని బూర్జుబావి గ్రామంలో చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువకుడిని మహిళ కుటుంబసభ్యులు కర్రలతో దాడి చేసి హత్య చేసిన ఘటన గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసుల కథనం ప్రకారం.. బూర్జుబావి గ్రామానికి చెందిన గడ్డం దావీద్ (30)కు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహేతర సంబంధం ఉంది. ఆ యువతి అతడికి సోదరి వరస అవుతుందని స్థానికులు చెబుతున్నారు. కొంతకాలంగా వీరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుండటంతో కుటుంబాల్లో తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఈ విషయం గ్రామంలోనూ చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల దావీద్, ఆ యువతి ఇద్దరూ కలిసి ఇళ్ల నుంచి పారిపోయారు. కొద్ది రోజుల పాటు గ్రామానికి దూరంగా ఉన్న వీరు.. కుటుంబాల ఒత్తిడి నేపథ్యంలో తిరిగి గ్రామానికి చేరుకున్నారు. అప్పటినుంచి ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగినట్లు సమాచారం. ఈ వ్యవహారం పెద్దల దృష్టికి వెళ్లినా పూర్తి స్థాయిలో పరిష్కారం కుదరలేదని తెలుస్తోంది.
ఈ క్రమంలో బుధవారం గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు దావీద్ పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. ఓటు వేసి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యువతి భర్తతో పాటు ఆమె సోదరుడు కలిసి దావీద్‌పై కర్రలతో దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం. రోడ్డుపైనే దావీద్‌ను నిర్దాక్షిణ్యంగా కొట్టారని గ్రామస్తులు చెబుతున్నారు.
తీవ్రంగా గాయపడిన దావీద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మృతుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమా, ముందే పథకం వేసి దాడి చేశారా అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
ALSO READ: Infertility Stress: సంతానం కలగడంలేదనే మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య





