
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ ఉద్ధృతంగా మారుతోంది. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరిన వేళ, ప్రచారంలో నిబంధనల ఉల్లంఘనలపై పరస్పర ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎలక్షన్ కమిషన్‌ను ఆశ్రయిస్తూ అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో ఎస్‌ఈసీ మార్గదర్శకాలను బహిరంగంగా ఉల్లంఘించారని ఆరోపిస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
మున్సిపల్ ఎన్నికల ప్రచారం పీక్స్‌కు చేరుకున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం తీవ్ర ఉద్రిక్తతకు లోనవుతోంది. ఈ సమయంలో బీజేపీ, ఎంఐఎం నేతల ప్రచార సభలు, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసింది. టీ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పి.రాజేశ్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినికి లేఖ రాసి, మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతత దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నెల 4వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్‌లో సమావేశం నిర్వహించారని, అలాగే 6వ తేదీన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో సభ నిర్వహించారని కాంగ్రెస్ తన ఫిర్యాదులో పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం విద్యాసంస్థలు లేదా వాటి ప్రాంగణాలను రాజకీయ ప్రచారాలు, సభల కోసం ఉపయోగించరాదనే స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ, ఈ సభలకు ఎలా అనుమతులు ఇచ్చారన్న అంశంపై సందేహాలు వ్యక్తం చేసింది. మున్సిపల్ ఎన్నికలు-2026 నేపథ్యంలో ఇటువంటి అనుమతులు ఇవ్వడం ఎన్నికల నియమాలకు విరుద్ధమని, ఇందుకు బాధ్యులైన రిటర్నింగ్ ఆఫీసర్లు, ఎన్నికల అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై మరో తీవ్రమైన ఆరోపణను కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తెచ్చింది. ఇటీవల పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్, జిన్నారం మున్సిపాలిటీల్లో హరీశ్‌రావు నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించారని పి.రాజేశ్ కుమార్ మరో లేఖలో ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బులు తీసుకుని, బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని హరీశ్‌రావు ఓటర్లను కోరినట్లు ఆరోపణలు వచ్చాయని, ఇది ఓటర్లను లంచాల ద్వారా ప్రభావితం చేసే ప్రయత్నంగా భావించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు, చర్యలు ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయడమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయమైన ఓటు హక్కుపై తీవ్ర ప్రభావం చూపుతాయని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను బహిరంగంగా దిక్కరించినట్టుగా ఈ వ్యవహారం ఉందని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించి ఎన్నికల సమగ్రతను ప్రమాదంలోకి నెట్టిన హరీశ్‌రావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరింది.
మొత్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం వేగంగా ముందుకు సాగుతున్న వేళ, నిబంధనల ఉల్లంఘనలపై రాజకీయ పార్టీల మధ్య ఫిర్యాదులు పెరుగుతుండటం, ఎన్నికల వాతావరణాన్ని మరింత హీట్ పెంచుతున్నట్లు కనిపిస్తోంది. ఈ అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
ALSO READ: అత్యధిక నంది అవార్డులు అందుకున్న హీరో ఎవరో తెలుసా?





