
గత కొద్ది రోజులుగా ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు వరుసగా సంచలనంగా మారుతున్నాయి. ఆమె చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అవుతూ నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న విమర్శలు, దుస్తులపై చేసే వ్యాఖ్యలు, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలపై అనసూయ గట్టిగా స్పందిస్తూ తన అభిప్రాయాలను ఎలాంటి వెనుకడుగు లేకుండా వ్యక్తం చేస్తోంది. ఈ కారణంగానే ఆమె పేరు తరచూ సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తులు, వారి ప్రవర్తనపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై అనసూయ తీవ్ర స్థాయిలో స్పందించడంతో విషయం మరింత పెద్దదైంది. ఒకవైపు ఆమెకు మద్దతుగా పలువురు నిలవగా, మరోవైపు విమర్శలు కూడా అదే స్థాయిలో వెల్లువెత్తాయి. అయినప్పటికీ తన అభిప్రాయాల విషయంలో ఎలాంటి రాజీ పడబోనని అనసూయ స్పష్టం చేస్తూ వరుస పోస్టులు చేస్తూనే వచ్చింది.
ఇదే సమయంలో తనపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు జరుగుతున్నాయంటూ ఏకంగా 73 మంది వ్యక్తులపై ఫిర్యాదు చేయడం ద్వారా అనసూయ అందరినీ షాక్‌కు గురిచేసింది. మహిళలను లక్ష్యంగా చేసుకుని చేసే దూషణలకు చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె బహిరంగంగా హెచ్చరించింది. ఈ పరిణామం సినీ ఇండస్ట్రీలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు కారణమైంది. ఈ వివాదం ఇంకా చల్లారకముందే తాజాగా అనసూయ మరో ట్వీట్‌తో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. సింగర్ చిన్మయి చేసిన ఓ ట్వీట్‌కు అనసూయ ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘దాదాపు 40 మంది ఎంపీలు ప్రస్తుతం అత్యాచార కేసుల్లో నిందితులుగా ఉన్న కారణంగా, అత్యాచార నేరస్తులకు మరణశిక్ష విధించే బిల్లుకు ఆమోదం లభించడం లేదు’’ అంటూ చిన్మయి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన అనసూయ ‘‘ఇదే మన భారతదేశం.. మనం ఎన్నుకున్న నాయకులు నడిపే దేశం. మనం ఇంకా చాలా దూరం వెళ్లాలి. కానీ దురదృష్టవశాత్తు మన చర్చలు మాత్రం బట్టల దగ్గరే ఆగిపోయాయి’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆమె చేసిన ఈ ట్వీట్ మహిళల భద్రత, న్యాయం వంటి కీలక అంశాలపై సమాజం ఎంత వెనుకబడి ఉందో స్పష్టంగా చూపుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. కొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏదేమైనా మహిళల హక్కులు, భద్రత, సమాజపు దృష్టికోణంపై అనసూయ లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు పెద్ద చర్చకే దారితీస్తున్నాయి.
ALSO READ: మీ కారు లీటర్‌కు ఎంత మైలేజ్ ఇస్తుందో ఈజీగా తెలుసుకోండి!





