క్రైమ్జాతీయం

పసిపాపపై తల్లి పైశాచికం.. వేడి అట్లకాడతో ప్రైవేట్ భాగాలపై వాతలు

అమ్మా అని పిలిపించుకొని మురిసిపోవాల్సిన తల్లి.. ఆ పసిపాప పాలిట కసాయిలా మారింది. కన్నతల్లి లేని లోటు తీర్చాల్సిన ఆమెనే.. నాలుగేళ్ల చిన్నారి జీవితాన్ని నరకంగా మార్చింది.

అమ్మా అని పిలిపించుకొని మురిసిపోవాల్సిన తల్లి.. ఆ పసిపాప పాలిట కసాయిలా మారింది. కన్నతల్లి లేని లోటు తీర్చాల్సిన ఆమెనే.. నాలుగేళ్ల చిన్నారి జీవితాన్ని నరకంగా మార్చింది. నిద్రలో పరుపు తడిపిందన్న చిన్న కారణంతో అట్లకాడను వేడి చేసి చిన్నారి మర్మాంగాలపై వాతలు పెట్టిన అమానవీయ ఘటన కేరళ రాష్ట్రం పాలక్కాడ్ జిల్లా కంజీకోడ్ సమీపంలో వెలుగుచూసింది. ఈ దారుణం వెలుగులోకి రావడంతో యావత్ సమాజం ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

గత వారం జరిగిన ఈ కిరాతకం బయటపడటానికి ఓ అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలి అప్రమత్తతే కారణమైంది. క్లాసులో ఆ చిన్నారి కూర్చోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుండటాన్ని, ముఖంలో చెప్పలేనంత వేదన కనిపించడాన్ని ఆ ఉపాధ్యాయురాలు గమనించారు. అనుమానం వచ్చి చిన్నారిని దగ్గరకు తీసుకుని విచారించగా, హృదయాన్ని కలిచివేసే నిజం బయటపడింది. పాప ప్రైవేట్ భాగాలపై తీవ్ర కాలిన గాయాలు ఉండటాన్ని చూసి ఉపాధ్యాయురాలు చలించిపోయారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితురాలు బీహార్‌కు చెందిన మహిళగా గుర్తించారు. ఆమె నేపాల్‌కు చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకోగా, ఆ వ్యక్తికి మొదటి భార్య ద్వారా కలిగిన ఈ నాలుగేళ్ల చిన్నారిని తనతోపాటే ఉంచుకుంది. అయితే పాప నిద్రలో పరుపు తడిపిందని కోపంతో ఊగిపోయిన ఆమె.. వంటింట్లో ఉన్న స్టీల్ అట్లకాడను స్టవ్‌పై వేడి చేసి చిన్నారి మర్మాంగాలపై వాతలు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితురాలిపై భారతీయ న్యాయ సంహితతో పాటు జువనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు గురువారం ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

ప్రస్తుతం తీవ్ర గాయాల పాలైన చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తమ సంరక్షణలోకి తీసుకుంది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై చిన్నారి తండ్రి పాత్రపై కూడా పోలీసులు దృష్టి సారించారు. హోటల్‌లో పని చేసే తండ్రికి ఈ విషయం తెలుసా, లేక భార్య చర్యలను సమర్థించాడా అన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

ALSO READ: Warning: ఆ సిరప్ వాడకాన్ని వెంటనే ఆపేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button