
క్రైమ్ మిర్రర్, కాకినాడ:- డ్యూటీలో లేకపోయినా… చంటి బిడ్డ చంకలో ఉన్నా… సమాజ బాధ్యత ముందు వ్యక్తిగత పరిస్థితులు అడ్డుకాలేవని మరోసారి నిరూపించారు. రంగంపేటకు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆముదాల జయశాంతి. కాకినాడ, సామర్లకోట ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌కు ఆమె స్వయంగా ముందుకు వచ్చి దారి క్లియర్ చేయడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ, సామర్లకోట రోడ్డులో వాహనాల రద్దీతో అంబులెన్స్ ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. అత్యవసర రోగిని తీసుకెళ్తున్న ఆ వాహనం నిమిషాలపాటు నిలిచిపోయింది. అదే సమయంలో అక్కడే ఉన్న జయశాంతి, తాను విధుల్లో లేకపోయినా, చేతిలో చంటి బిడ్డ ఉన్నప్పటికీ పరిస్థితి తీవ్రతను గ్రహించారు. ఏ క్షణం ఆలస్యం జరిగినా ప్రాణాపాయం కలగవచ్చన్న భావనతో ఆమె వెంటనే స్పందించి, వాహనదారులకు సూచనలు ఇస్తూ అంబులెన్స్‌కు దారి కల్పించారు. కొద్దిసేపట్లోనే ట్రాఫిక్ సాఫీగా మారి అంబులెన్స్ గమ్యస్థానానికి బయలుదేరింది. ఈ విషయం సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదే నిజమైన పోలీస్ విధి,.. మాతృత్వం, మానవత్వం కలిసిన దృశ్యం, యూనిఫామ్ లేకపోయినా బాధ్యత తీరుతుందన్న ఉదాహరణ, అంటూ నెటిజన్లు జయశాంతిని కొనియాడుతున్నారు.
యూనిఫామ్ కంటే పెద్దది బాధ్యత ఈ ఘటన ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. పోలీస్ విధి అనేది కేవలం డ్యూటీ గంటలకే పరిమితం కాదని, సమాజ భద్రత పట్ల ఉన్న నిబద్ధతే అసలైన గుర్తింపని జయశాంతి చర్య చాటింది.
అత్యవసర సమయాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఎలా ప్రాణాంతకంగా మారుతాయో, అదే సమయంలో ఒక వ్యక్తి తీసుకున్న చిన్న నిర్ణయం ఎలా ప్రాణాలను కాపాడగలదో ఈ సంఘటన తెలియజేస్తోంది. చట్టాన్ని అమలు చేయడమే కాదు, అవసరమైన వేళ మానవత్వంతో స్పందించడమే నిజమైన పోలీస్ సేవ. చంటి బిడ్డను చంకలో పెట్టుకుని కూడా అంబులెన్స్‌కు దారి చేసిన జయశాంతి చర్య, సమాజానికి ఒక పాఠం, పోలీస్ వ్యవస్థకు ఒక గర్వకారణం. మాతృత్వానికి సెల్యూట్… కర్తవ్యానికి సెల్యూట్.
Read also : BMC Elections: ఫైవ్‌స్టార్ హోటల్‌కు షిండే కార్పొరేటర్లు, మేయర్ పదవి కోసం పట్టు!





