Sonia Gandhi On VB–G Ram G Bill: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్నివిధ్వంసం చేయడం వల్ల దేశంలోకి కోట్లాది మంది గ్రామీణులు దారుణమైన విపత్తును ఎదుర్కోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ ఉపాధి కల్పించే హక్కును కాపాడుకోవడానికి ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీబీ జీ రాం జీ పథకాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో ఆమె ఓ ఆంగ్ల దినపత్రికలో వ్యాసం రాశారు.
ఉపాధి హామీపై బుల్డోజర్
మహాత్మాగాంధీ ఆశయమైన సర్వోదయ స్ఫూర్తితో, రాజ్యాంగంలోని 41వ అధికరణంలో పొందుపరిచిన పని హక్కుకు అనుగుణంగా ఉపాధి హామీ పథకాన్ని రూపొందించారని తెలిపారు. దానిని నరేంద్ర మోడీ ప్రభుత్వం బుల్డోజర్‌తో విధ్వంసం చేసిందని ఆరోపించారు. ‘‘ఎలాంటి చర్చలు లేవు. సంప్రదింపులు లేవు. పార్లమెంటరీ సంప్రదాయాలనుగానీ, కేంద్ర రాష్ట్ర సంబంధాలనుగానీ గౌరవించినదీ లేదు. ఈ ప్రక్రియలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం చాలా చిన్న అంశం. జీవితాలపై ప్రభావం చూపే మొమత్తం పథకాన్నే నాశనం చేయడం గమనించదగ్గది’’ అని రాసుకొచ్చారు.
వీబీ- జీ రాం జీ పథకంపై ఆంక్షలు
నూతన వీబీ- జీ రాం జీ పథకం చాలా ఆంక్షలతో కూడుకున్నదని సోనియా అభిప్రాయపడ్డారు. దీంట్లోని నిబంధనలు అధికారుల ఆదేశాల్లాంటివి తప్ప ప్రజల ప్రమేయంతో కూడుకున్నవి కావని తెలిపారు. ‘‘కేంద్ర ప్రభుత్వ విచక్షణ అధికారంతో ఇది అమలవుతుంది. నిధుల కేటాయింపుపై బడ్జెట్‌లో పరిమితి విధిస్తారు. దీనివల్ల పని దినాలపైనా ఆంక్షలు ఉంటాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా కాకుండా కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు పనులు ఉంటాయి. ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తామన్న హామీకి చెల్లుచీటి పలికారు’’ అని వివరించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో భూమి లేని పేదల కొనుగోలు శక్తి పెరిగిందని, వ్యవసాయ కూలీ పెరిగిందని సోనియా తెలిపారు. ఈ పథకం కనబరిచిన పెద్ద ప్రభావం ఇదేనన్నారు. కొత్త చట్టం ద్వారా ప్రజలు తమ ఉపాధిని కోల్పోతారని చెప్పుకొచ్చారు. వ్యవసాయ రంగంపై ఆధారపడ్డవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వేతనాల పెరుగుదలను అడ్డుకోవడం సరికాదని తెలిపారు.





