
తెలంగాణ బీజేపీలో అసమ్మతి ముదురుతోంది. జిల్లా అధ్యక్షుల ఎంపిక బీజేపీలో అసంతృప్తి జ్వాలలు రేపుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో వర్గపోరు బహిర్గతమవుతోంది.కొందరు నేతలు బహిరంగంగానే పార్టీ తీరుపై ఆరోపణలు చేస్తున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమలం పార్టీలో బాంబా పేల్చారు.
సొంత పార్టీలోనే వేధింపులు భరించలేకపోతున్నానని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. వెళ్లిపొమ్మంటే వెళ్లిపోతానని స్పష్టం చేశారు. గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీకి ఇవ్వాలని సూచిస్తే… MIMతో తిరిగే వ్యక్తికి ఇచ్చారని ఆరోపించారు. ప్రత్యర్థులతోపాటు సొంత పార్టీలోనూ తాను యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. కొందరు అనుసరిస్తున్న బ్రోకరిజం వల్లే పార్టీ వెనుకబడిందన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్లు కమలం పార్టీలో కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటున్నారు రాజాసింగ్. తాజాగా తాను టార్చర్ భరించలేకపోతున్నానని కామెంట్ చేయడంతో.. రాజాసింగ్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.