
MLA Raja Singh: తన రాజీనామాను ఆమోదించిన తర్వాత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తొలిసారి స్పందించారు. ఎమోషనల్ గా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. హిందుత్వం కోసమే పుట్టానని, తన చివరి శ్వాస వరకు హిందుత్వం కోసమే పని చేస్తానని తేల్చి చెప్పారు. బీజేపీ అధ్యక్ష పదవిని రామచందర్ రావుకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి ఇటీవల రాజాసింగ్ రాజీనామా చేశారు. తాజాగా ఆయన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఈ నేపథ్యంలో రాజా సింగ్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
రాజాసింగ్ ఏమన్నారంటే?
“సరిగ్గా 11 సంవత్సరాల క్రితం, నేను భారతీయ జనతా పార్టీలో చేరాను. ప్రజలకు, దేశానికి సేవ చేయడంతో పాటు హిందూత్వాన్ని రక్షించాలనే లక్ష్యంతో, అప్పట్లో నేను బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నాను. బిజెపి నన్ను నమ్మి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గోషామహల్ నుండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ప్రజలు మూడుసార్లు గెలిపించారు. నామీద నమ్మకాన్ని ఉంచిన ప్రజలకు, బిజెపి పదాధికారులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా నా రాజీనామాను ఆమోదించారు. తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కలతో పగలు, రాత్రి పనిచేస్తున్న లక్షలాది మంది బిజెపి కార్యకర్తల బాధను నేను ఢిల్లీకి తెలియజేయలేకపోవచ్చు. నేను ఈ నిర్ణయం ఏ పదవి, అధికారం, వ్యక్తిగత కోరికలతో తీసుకోలేదు. నేను హిందూత్వకు సేవ చేయడానికి పుట్టాను. నా చివరి శ్వాస వరకు హిందూత్వం కోసం పని చేస్తూనే ఉంటాను. హిందుత్వం, జాతీయత, సనాతన ధర్మాన్ని రక్షించడానికి నేను ఎల్లప్పుడూ నిజాయితీతో పని చేస్తాను. నా చివరి శ్వాస వరకు సమాజ సేవ, హిందూ సమాజ హక్కుల కోసం నా గొంతుకను వినిపిస్తూనే ఉంటాను” అని రాజాసింగ్ వెల్లడించారు.
Read Also: డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వట్టే జానయ్యకు సిట్ నోటీసులు