Medaram: లేడి ఐపీఎస్ డ్యాన్స్ వైరల్.. నెజిజన్లు ఫిదా

Medaram: ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి సోషల్ మీడియా ప్రభావంతో దేశదేశాలకూ విస్తరించింది.

Medaram: ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి సోషల్ మీడియా ప్రభావంతో దేశదేశాలకూ విస్తరించింది. సంప్రదాయంగా ప్రధాన మీడియా కథనాలతో వెలుగులోకి వచ్చే ఈ జాతరకు.. ఈ ఏడాది మాత్రం సోషల్ మీడియానే అసలైన వేదికగా మారింది. లక్షలాది మంది భక్తులు హాజరైన ఈ మహా జాతరలో జరిగే ప్రతి ఘట్టం, ప్రతి క్షణం మొబైల్ కెమెరాల్లో బంధించబడుతూ సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలోనే ఒక ఐపీఎస్ అధికారిణి చేసిన సరళమైన గిరిజన నృత్యం అనుకోకుండా వైరల్ అవుతూ పెద్ద చర్చకు దారి తీసింది.

గతంలో కుంభమేళాలో పూసల అమ్ముకునే ఓ యువతి మోనాలిసా అంటూ వైరల్ అయి, ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిన ఉదాహరణను దేశం చూసింది. అదే తరహాలో ఇప్పుడు మేడారం జాతరలో ఓ ఐపీఎస్ అధికారిణిని మేడారం మోనాలిసా అంటూ సోషల్ మీడియా వినియోగదారులు ట్రెండ్ చేయడం ప్రారంభించారు. ఆమె చేసిన గిరిజన డాన్స్ వీడియోలు క్షణాల్లో వేలాది షేర్లు, లక్షలాది వ్యూస్ దక్కించుకున్నాయి. అక్కడితో ఆగకుండా, ఆమె వ్యక్తిత్వం, అందం, డాన్స్ శైలి అంటూ రకరకాల వ్యాఖ్యలతో సోషల్ మీడియా పోస్టులు వెల్లువెత్తాయి.

బాగా చదివి, కఠినమైన శిక్షణ పూర్తి చేసి, ఐపీఎస్ అధికారిణిగా బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తున్న ఓ ఉన్నతాధికారిణిపై ఇలా వ్యాఖ్యలు చేయడం సరైందా అనే చర్చ కూడా మొదలైంది. అందమైన ఐపీఎస్ ఆఫీసర్, మేడారం మోనాలిసా, గిరిజన నృత్యాలతో ఆకట్టుకున్న అధికారిణి అంటూ అనేక రకాల పోస్టులు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఆమె విధి నిర్వహణకు మించిన అంశాలను హైలెట్ చేస్తూ చేస్తున్న ప్రచారం కొందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మేడారం జాతరలో మంత్రి సీతక్కతో పాటు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి ఆమె ఉత్సాహంగా డాన్స్ చేసిన వీడియో మరింత వైరల్ అయింది. అధికారిక విధుల్లో భాగంగా అక్కడ ఉన్నప్పటికీ, స్థానిక గిరిజనుల సంస్కృతి పట్ల గౌరవం చూపుతూ ఆమె నృత్యంలో పాల్గొనడం పలువురి ప్రశంసలు అందుకుంది. అయితే అదే వీడియోను ఆధారంగా చేసుకుని ఆమెను కేవలం అందం కోణంలో చూడడం సరికాదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఈ వైరల్ అధికారిణి ఎవరు అనే ఆసక్తితో నెటిజన్లు సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆజంఘడ్‌కు చెందిన 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి వసుంధర యాదవ్ అని సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. కల్లూరు సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న అజయ్ యాదవ్‌ను వివాహం చేసుకున్న ఆమె.. గతంలో గ్రేహౌండ్స్‌లో పని చేసిన అనుభవం కూడా కలిగి ఉన్నారు. ప్రస్తుతం కల్లూరు ఏసీపీగా శాంతిభద్రతల పరిరక్షణలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ సమర్థవంతంగా పని చేస్తున్నారు.

మేడారం జాతర సందర్భంగా జరిగిన ఈ ఘటన సోషల్ మీడియా శక్తిని మరోసారి రుజువు చేస్తోంది. ఒక చిన్న వీడియో ఎలా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుందో చూపించింది. అదే సమయంలో, ఉన్నతాధికారుల వ్యక్తిగత గౌరవం, వృత్తి పరమైన గుర్తింపును కాపాడాల్సిన అవసరం ఉందన్న సందేశాన్ని కూడా ఈ సంఘటన గుర్తు చేస్తోంది.

ALSO READ: ఇన్‌స్టా పరిచయంతో మహిళ ఎఫైర్.. ప్రైవేట్ ఫొటోలతో వేధింపులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button