
Medaram Jatara: తెలంగాణ కుంభమేళాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ఘనంగా ప్రారంభమైంది. బుధవారం అసలు జాతర ప్రారంభం కావడంతో మేడారం అటవీ ప్రాంతం భక్తజనంతో కిటకిటలాడుతోంది. 4 రోజుల పాటు ఈ మహా జాతర అంగరంగ వైభవంగా కొనసాగనుంది. ప్రధాన ఘట్టం మొదలవ్వడంతో లక్షలాది మంది భక్తులు మేడారం వైపు తరలివస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. మేడారంలో అడుగు పెట్టడానికి కూడా చోటు లేని పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా భక్తుల తాకిడి కనిపిస్తోంది.
భక్తులు సమ్మక్క సారలమ్మకు తమ మొక్కులను బెల్లం, బంగారంతో చెల్లించుకుంటూ గద్దెల వద్ద దర్శనానికి క్యూలలో నిలుస్తున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం గద్దెల వద్ద దేవతలను దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. భక్తుల రద్దీతో మేడారం జనసంద్రంగా మారింది. ఈ జన ప్రవాహంతో పాటు వ్యాపారుల హడావుడి కూడా అంతకంతకూ పెరుగుతోంది. జాతర ప్రారంభమైన నాటి నుంచే వ్యాపారులు ధరలను ఇష్టారాజ్యంగా పెంచి భక్తులపై భారం మోపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మేడారంకు వచ్చే భక్తులు మొక్కుల కోసం కోళ్లు, మేకలను సమర్పించడం ఆనవాయితీ. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వాటిని వెంట తెచ్చుకోవడం సాధ్యంకాక జాతర ప్రాంతంలోనే కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు కోళ్లు, మేకల ధరలను రెట్టింపు చేశారు. బయట మార్కెట్‌లో లైవ్ కోడి కిలో ధర సుమారు రూ.170 ఉంటే మేడారం జాతరలో మాత్రం రూ.350 వరకు విక్రయిస్తున్నారు. అలాగే మటన్ కిలో ధరను ఏకంగా రూ.1500 వరకు పెంచి అమ్ముతున్నారు. బయట లైవ్ మేక కిలో ధర రూ.420గా ఉండగా జాతరలో మాత్రం రూ.1000 వరకు వసూలు చేస్తూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
ఇక మద్యం ధరలపైనా భారీగా పెంపు కనిపిస్తోంది. బీర్, విస్కీ, బ్రాందీ వంటి మద్యాలపై రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు. జాతర మొదలైన మొదటి రోజుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికెన్, మటన్, మేకలతో పాటు నాటుకోడి ధరలు కూడా భారీగా పెరిగాయి. బయట నాటుకోడి కిలో ధర రూ.400 వరకు ఉంటే మేడారం పరిసర ప్రాంతాల్లో రూ.700 వరకు వసూలు చేస్తున్నారు.
ఇక వసతి, విశ్రాంతి పేరుతో కూడా భక్తులపై అదనపు భారం పడుతోంది. జాతర ప్రాంతానికి సమీపంలో ఉన్న ఇళ్ల అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక్క రోజుకు రూ.6 వేల వరకు అద్దె వసూలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు కూర్చోవడానికి నీడ కోసం కూడా డబ్బులు వసూలు చేయడం జాతరలో ప్రత్యేక చర్చకు దారి తీసింది. తోటలు, వ్యవసాయ భూములు ఉన్న కొందరు స్థానికులు చెట్ల కింద నీడను కూడా అద్దెకు ఇస్తున్నారు. ఒక్కో చెట్టుకు రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది.
కుటుంబంతో కలిసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి భక్తులు డబ్బులు చెల్లించి చెట్ల నీడను అద్దెకు తీసుకుంటున్నారు. చెట్టు నీడకు కూడా అద్దె వసూలు చేసే పరిస్థితి రావడం మేడారం జాతరలో ఈసారి విశేషంగా మారింది. భక్తి భావంతో వచ్చిన భక్తులు ఈ దోపిడీని చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు ఈ ధరల పెంపుపై నియంత్రణ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. కోట్లాది మంది విశ్వాసాలతో ముడిపడిన ఈ మహా జాతరలో భక్తులపై భారం మోపకుండా, సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: రైల్వే టికెట్ రద్దు చేసుకుంటే..?





