Mary Kom Controversy: భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్.. పెళ్లైన 20 ఏళ్ల తర్వాత తన భర్త కరుంగ్ ఆంఖోలర్ నుంచి విడాకులు తీసుకుంది. ఇటీవల ఈ విడాకుల గురించి మేరీ కోమ్ సంచలన విషయాలు బయట పెట్టింది. తన భర్త ఆర్థికంగా దారుణంగా మోసం చేశాడని.. తన కష్టార్జితంతో కొన్న ఆస్తులను తనకే తెలియకుండా అతడి పేరు మీదకు మార్చుకున్నారని ఆరోపించింది. ఆస్తులను తనఖా పెట్టి భారీగా అప్పులు చేశాడని, ఈ నేపథ్యంలో తాను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయానని ఆవేదన వ్యక్తం చేసింది.
మేరీ కోమ్ వ్యాఖ్యలను ఖండించిన మాజీ భర్త
అటు మేరీ కోమ్ చేసిన ఆరోపణలపై ఆమె మాజీ భర్త ఆంఖోలర్ స్పందించారు. ఆమె చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నాడు. “నేను రూ.5కోట్లు దోచుకున్నానని ఆరోపణలు చేస్తోంది. నా బ్యాంక్ ఖాతాలు చెక్ చేయండి. ఢిల్లీలో అద్దె ఇంట్లో ఉంటున్న వ్యక్తిని చూసి కూడా ఇలా అంటారా? ఆమె సెలబ్రిటీ. ఆమె మాటలు కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. మేరీ కోమ్ చేసిన ఆరోపణల్లో వాస్తవాలే లేవు. మాకు సంప్రదాయబద్ధంగా విడాకులు అయ్యాయి. ఇంకా కోర్టుకు వెళ్లలేదు. పిల్లలను ప్రేమిస్తున్నాను కాబట్టే న్యాయపోరాటానికి దూరంగా ఉన్నాను. జాతీయ మీడియా ముందు నాపై నిందలు వేయడం ఎందుకు?” అన్నాడు.
జూనియర్ బాక్సర్ తో వివాహేతర సంబంధం
అటు తమ దాంపత్య జీవితంలో సమస్యలు ఇప్పుడే మొదలుకాలేదన్నాడు ఆంఖోలర్. 2013లో ఒక జూనియర్ బాక్సర్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడిందని చెప్పాడు. ఆ సమయంలో గొడవలు జరిగాయన్నాడు. చివరకు రాజీ కుదిరిందన్నాడు. కానీ, 2017 నుంచి మేరీ కోమ్ బాక్సింగ్ అకాడమీలో పని చేసే మరో వ్యక్తితో ఆమె సంబంధం కొనసాగుతోందన్నాడు. వాట్సాప్ మెసేజ్ లతో సహా తన దగ్గర ఆధారాలున్నాయన్నాడు. అయినా తాను మౌనంగా ఉన్నానని చెప్పాడు. ఆమె ఒంటరిగా ఉండాలనుకున్నా.. మరో పెళ్లి చేసుకున్నా తనకు సమస్య లేదన్నాడు. కానీ, తనన దోషిగా చిత్రీకరించవద్దన్నాడు. ఆరోపణలు చేస్తే ఆధారాలు చూపాలని ఆంఖోలర్ నిలదీశాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.





