
మర్రిగూడ (క్రైమ్ మిర్రర్):- అధికారం అంటే కేవలం కార్యాలయానికి పరిమితం కాదని, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే అసలైన పరమార్థమని మర్రిగూడ తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాస్ నిరూపించారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆయన తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. నిరుపేదలు, అనాథల కన్నీళ్లు తుడుస్తూ, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి, అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన స్నేహితుల సహకారంతో పేదలను ఆయన అక్కున చేర్చుకున్నారు. తహసీల్దార్ శ్రీనివాస్ ఒక అడుగు ముందుకు వేసి, సమాజం పట్ల తనకున్న బాధ్యతను చాటుకున్నారు. తన స్నేహితుల బృందాన్ని సమన్వయం చేసుకుని, సుమారు 2 లక్షల 70 వేల రూపాయల నిధిని సేకరించారు. ఈ మొత్తాన్ని మండలంలోని అత్యంత నిరుపేద స్థితిలో ఉన్న 20 కుటుంబాలకు పంపిణీ చేశారు. కేవలం ఆర్థిక సహాయం చేయడమే కాకుండా, నిజమైన అర్హులకు ఆ సాయం అందాలనే ఉద్దేశంతో, మండలంలోని వివిధ గ్రామాల్లో సర్వే చేసి బాధితులను ఎంపిక చేశారు. తల్లిదండ్రులు లేని చిన్నారుల చదువుల కోసం, ఆసరా లేని నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు, ఆరోగ్య బాధితులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, వైద్య ఖర్చులు భరించలేని నిరుపేదలకు ఈ నగదును అందజేశారు. మనం సంపాదించే దాంట్లో కొంత భాగం, సమాజానికి తిరిగి ఇవ్వడం వల్ల కలిగే తృప్తి వెలకట్టలేనిదని ఈ సందర్బంగా ఆయన అన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున ఈ చిరు సాయం అందించడం సంతోషంగా ఉందన్నారు.

తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాస్ పై ప్రశంసల జల్లు.
తహసీల్దార్ చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రభుత్వ అధికారి తన విధి నిర్వహణతో పాటు, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఇతర అధికారులకు, ఆదర్శప్రాయమని పలువురు కొనియాడారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, లక్షల రూపాయల మేర సాయం అందించడం, మర్రిగూడ మండల చరిత్రలో ఒక ప్రత్యేక సందర్భమని స్థానిక నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌తో పాటు ఆయన స్నేహితులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నగదు అందుకున్న కుటుంబాలు, తమ కష్టకాలంలో ఆదుకున్న తహసీల్దార్ శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు.
Read also : హిందీ చిత్రాలు మూలాలను కోల్పోతున్నాయి.. ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు?
Read also : ఆత్మకూరు(ఎం)లో శ్రీ కనకదుర్గ అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవం





