
ఇటీవలి కాలంలో సమాజాన్ని కలచివేస్తున్న అంశాల్లో చిన్న చిన్న కారణాలతో జరిగే హత్యలు ప్రధానంగా నిలుస్తున్నాయి. క్షణికావేశం, ఆగ్రహం, సహనం లేకపోవడం వల్ల నిండు ప్రాణాలు బలవుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం మెదక్ జిల్లాలో కేవలం రూ.22 విషయంలో తలెత్తిన గొడవ ఓ యువకుడి ప్రాణాన్ని తీసిన విషయం ఇంకా మర్చిపోకముందే, అదే ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అన్నం తిన్న ప్లేటులో చేయి కడిగాడన్న చిన్న కారణమే స్నేహితుడి ప్రాణాన్ని తీసే స్థాయికి చేరడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్మాన్ నగర్ హోమ్ ట్రీ అపార్ట్మెంట్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. శ్యామ్ పంచాలు (28), మిథ్లేష్ కుమార్, అతుల్ సహానీ అనే ముగ్గురు యువకులు ఉద్యోగాల నిమిత్తం ఒకే ఇంట్లో అద్దెకు ఉంటూ స్నేహంగా జీవిస్తున్నారు. సోమవారం జనవరి 19 రాత్రి ముగ్గురూ కలిసి భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో అతుల్ సహానీ తిన్న ప్లేటులో శ్యామ్ పంచాలు చేయి కడగడం జరిగింది. ఇదే విషయాన్ని అతుల్ తీవ్రంగా తప్పుబట్టాడు.
చిన్న మాటగా మొదలైన వాగ్వాదం క్షణాల్లో ఘర్షణగా మారింది. మాటలు పెరిగి ఆగ్రహం హద్దులు దాటింది. తీవ్ర కోపానికి లోనైన అతుల్ సహానీ పక్కనే ఉన్న పప్పు కుక్కర్‌ను ఎత్తుకుని శ్యామ్ తలపై బలంగా దాడి చేశాడు. ఒక్క దెబ్బతో శ్యామ్ కుప్పకూలిపోయాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే శ్యామ్ మృతి చెందాడు. ఈ అకస్మాత్తు ఘటనతో అపార్ట్మెంట్ మొత్తం భయాందోళనకు గురైంది.
సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేశారు. శ్యామ్ హత్యకు ఇదే అసలు కారణమా, లేక ఈ ఘటనకు వెనుక మరేదైనా లోతైన వివాదాలున్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, అపార్ట్మెంట్ పరిసరాల్లోని ఆధారాలను సేకరిస్తున్నారు.
చిన్నపాటి కారణంతో ఒక యువకుడి జీవితం ముగియడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. క్షణికావేశంలో చేసిన ఒక చర్య రెండు కుటుంబాల జీవితాలను శాశ్వతంగా మార్చేసింది. శ్యామ్ కుటుంబం తీరని దుఃఖంలో మునిగిపోయింది. మరోవైపు అతుల్ సహానీ చేసిన నేరంతో అతని కుటుంబం కూడా సమాజంలో తలదించుకునే పరిస్థితి ఎదుర్కొంటోంది. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఈ ప్రాణనష్టం జరిగేదే కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలోనూ తీవ్ర స్పందన కనిపిస్తోంది. మనుషులు ఇలా తయారవుతున్నారేంటి, ఇంత చిన్న కారణానికి కూడా చంపేస్తారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: అద్భుత దృశ్యం.. శివలింగాన్ని చుట్టుకున్న నాగుపాము





