SC Issues Notice to Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సర్కారుకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఐ-ప్యాక్ కార్యాలయంపై ఈడీ దాడులనేపథ్యంలో తలెత్తిన వివాదంపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం, ఈడీ అధికారులపై నమోదైన ఎఫ్ఐఆర్ లపై స్టే విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
మరీ ఇంత అరాచకత్వమా?
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. సీఎం వ్యవహార శైలి చట్ట ఉల్లంఘన కిందికి వస్తుందని అభిప్రాయపడింది. కేంద్ర దర్యాప్తు సంస్థల పనిలో రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం తీవ్రమైన విషయమన్నది. సీఎం వ్యవహార శైలి అరాచకానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఆ FIRలపై స్టే విధించిన సుప్రీం కోర్టు
అటు ఈడీ అధికారులపై బెంగాల్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లపై తదుపరి విచారణ జరగకుండా స్టే విధించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని సీఎం మమతా బెనర్జీతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, డీజీపీ రాజీవ్ కుమార్, కోల్‌కతా పోలీస్ కమిషనర్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సోదాలు జరిగిన ప్రాంతాల్లోని CCTV ఫుటేజీలను, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను భద్రపరచాలని కూడా కోర్టు ఆదేశించింది.
ఇంతకీ అసలు వివాదం ఏంటి?
జనవరి 8న కోల్‌కతాలోని ఐ-ప్యాక్ కార్యాలయం, దాని డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో సీఎం మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి చేరుకుని తమ దర్యాప్తునకు ఆటంకం కలిగించారని, కీలక ఆధారాలను, డిజిటల్ పరికరాలను తీసుకువెళ్లారని ఈడీ ఆరోపించింది. దీనిపై బెంగాల్ పోలీసులు ఈడీ అధికారులపైనే కేసులు నమోదు చేయడంతో, ఆ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.





